ఉక్రెయిన్‌లో నో ఫ్లై జోన్ అమలు చేయాలని నాటో దేశాలను ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు. నో ఫ్లై జోన్ అమలు చేయాలనే ఆయన ప్రతిపాదనను నాటో తిరస్కరించింది. అలా చేస్తే.. ఐరోపాలో పెను యుద్ధానికి దారితీస్తుందన్న నాటో హెచ్చరిస్తోంది. ఉక్రెయిన్ గగనతలంలో నో ఫ్లై జోన్ ఏర్పాటుకు తిరస్కరించినందుకు ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)పై అధ్యక్షుడు జెలెన్ స్కీ మండిపడుతున్నారు. నాటో నిర్ణయంతో ఉక్రెయిన్ నగరాలు, గ్రామాలపై రష్యా మరిన్ని బాంబు దాడి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అవుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా, భూమి, సముద్రం, వాయు మార్గం ద్వారా ఏకకాలంలో దాడులకు తెగబడుతున్నది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై నో ఫ్లై జోన్ ఏర్పాటు చేయాలని జెలెన్ స్కీ నాటోను అభ్యర్థించడంతో తిరస్కరించింది. తూర్పు ఐరోపాను యుద్ధంలోకి లాగడానికి నాటో కూటమి ఇష్టపడం లేదు. నాటో సమావేశం బలహీన, గందరగోళ సమావేశంగా జెలెన్ స్కీ విమర్శించారు. ఐరోపా స్వాతంత్య్రం కోసం జరిగే పోరాటాన్ని అందరూ మొదటి లక్ష్యంగా భావించరని ఆ సమావేశంలో ఒక విషయం స్పష్టమైందన్నారు. ఉక్రెయిన్ భూభాగం, గగనతలం జోలికి వెళ్లబోమని నాటో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో పరిస్థితి భయానకంగా ఉందని, రష్యా దాడులకు తెగబడుతుండటంతో ప్రజలు పడుతోన్న బాధలు తమకు తెలుస్తున్నాయని నాటో ప్రధాన కార్యదర్శి స్టోలెన్ బర్గ్ స్పష్టం చేశారు.
రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఎన్నడూ లేనంత విధ్వంసం కనిపిస్తోందని, నో ఫ్లై జోన్ అమలుకు ఉన్న ఏకైక మార్గం నాటో యుద్ధ విమానాలను ఉక్రెయిన్ గగనతలంలోకి పంపించడం, అనంతరం రష్యా విమానాలు కూల్చివేయడం, అదే చేస్తే.. ఐరోపాలో పూర్తి స్థాయి యుద్ధానికి పరిస్థితులు దారితీస్తాయని తెలిపారు. నో ఫ్లై జోన్ ప్రాంతంలో మిలిటరీ శక్తుల పహారా ఉంటుంది. యుద్ధాలు, దేశాల మధ్య అనిశ్చితి ఉన్న సమయంలో శత్రువులు దాడి చేయకుండా నిరోధించేందుకు నో ఫ్లై జోన్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది గగనతలం మూసివేయడం కిందికి రాదు. గగనతలం మూసివేస్తే.. కేవలం కమర్షియల్ విమానాల రాకపోకలకు వీలుండదు. అదే నో ఫ్లై జోన్ విషయంలో.. ప్రత్యర్థి దేశం దాడికి దిగితే.. దాడికి గురైన దేశం.. దాని మిత్ర దేశాలు ప్రత్యర్థి విమానాలను కూల్చివేయవచ్చు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..