న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, వెనుకబడిన వర్గాల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన మహా ధర్నాలో ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ నుంచి వచ్చిన అనేకమంది పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ జబ్బాల శ్రీనివాస్ నాయకత్వం వహించగా, గుజ్జ కృష్ణ, కర్రి వేణుమాధవ్ తదితరులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలలో పర్యటించి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. వచ్చే జులైలో బీసీ బిల్లు సాధన కోసం 4 లక్షల మందితో పార్లమెంట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా బీసీలకు ఏ రంగంలోనూ జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదని, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కనీస ప్రాతినిథ్యం లభించలేదని కృష్ణయ్య ఆరోపించారు. రాజకీయ రంగంలో వెనుకబడిన వర్గాల ప్రాతినిథ్యం 14 శాతం దాటలేదని కేంద్రం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వారా తెలిసిందన్నారు. బీసీలకు ఇచ్చేది భిక్ష కాదన్న ఆయన, రాజ్యాంగబద్ద ప్రజాస్వామ్య హక్కని గుర్తు చేశారు.