గత కొంతకాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందులో భాగంగా మన దేశంలో కూడా కోవిడ్ కలవరం మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఒకవేళ కేసులు పెరిగితే అప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి హాస్పిటళ్లు అన్నీ ప్రిపేరవుతున్నాయి. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఈరోజు మాక్ డ్రిల్‌ను పర్యవేక్షించారు.
నగరంలోని సఫ్దార్జంగ్ హాస్పిటల్లో మంత్రి మాండవీయ పరిశీలించారు. ఇలాంటి డ్రిల్ చేపట్టడం వల్ల మనం ఎంత వరకు సంసిద్ధంగా ఉన్నామో తెలుస్తుందని, ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకునే వీలవుతుందని మంత్రి మాండవీయ తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్లోనూ ఈరోజు కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కోవిడ్ పేషెంట్లు పెరిగితే అప్పుడు ఎలాంటి చికిత్సను అందించాలో హాస్పిటల్ సిబ్బంది సిద్ధం చేశారు.