న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తగ్గినట్టే తగ్గి చైనా సహా పలు దేశాల్లో ఒక్కసారిగా పెరిగిన కోవిడ్-19 కొత్త కేసులు మిగతా ప్రపంచదేశాలను అప్రమత్తం చేశాయి. చైనాకు పొరుగునే ఉన్న భారతదేశం ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. తాజాగా వైద్యారోగ్య వ్యవస్థ సంసిద్ధతను పరీక్షించి, సమీక్షించేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్-19 ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. ఈ మాక్ డ్రిల్‌లో వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారులతో పాటు ఆయా రాష్ట్రాల మంత్రులు కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు. 2021లో కోవిడ్-19 సెకండ్ వేవ్ సమయంలో ఒక్కసారిగా మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరగడంతో పాటు వైద్యారోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని మించి కేసులు నమోదైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. చైనా తరహాలో దేశంలో కేసుల ఉధృతి ఒక్కసారిగా పెరిగితే ఎలా వ్యవహరించాలి అనే విషయంపై దృష్టి పెట్టింది.
ఈ క్రమంలోనే మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. తద్వారా వ్యవస్థలో లోటుపాట్లను గుర్తించి సరిదిద్దుకోడానికి ఆస్కారం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. ఈ మాక్ డ్రిల్‌లో భాగంగా ఆస్పత్రుల్లో పడకలు, మెడికల్ ఆక్సిజన్ లభ్యత, అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది సంఖ్య తదితర నిర్వహణపరమైన అంశాలను పరిశీలించనున్నారు. ఇందులో నర్సులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు సైతం భాగస్వాములు కానున్నారని కేంద్రం తెలిపింది. ముఖ్యంగా వ్యాధి తీవ్రత అధికంగా ఉండే కేసులకు వైద్యం అందించే వ్యవస్థలో భాగమైన ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల లభ్యత వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు సమాయత్తం కావాలన్నదే తమ ఉద్దేశమని కేంద్రం చెబుతోంది.
విదేశాల నుంచి వచ్చేవారిపై నజర్
చైనాలో కోవిడ్-19 కొత్త కేసుల విస్తృతిపై వార్తలు వచ్చిన వెంటనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయి సమావేశాలు నిర్వహించి అప్రమత్తతను ప్రకటించింది. ఓవైపు ప్రజలను బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ రద్దీ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని సూచించిన ప్రభుత్వం, మరోవైపు దేశంలో నమోదయ్యే కోవిడ్-19 కేసుల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించాలని ఆదేశించింది. అలాగే విదేశాల నుంచి భారత్ చేరుకునే ప్రయాణికులకు ర్యాండమ్‌గా కోవిడ్ పరీక్షలు చేపట్టింది. ఎయిర్ సువిధ పోర్టల్‌ను మళ్లీ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం, విదేశాల నుంచి భారత్ చేరుకునే ప్రయాణికులు తప్పనిసరిగా పోర్టల్‌లో నమోదు చేసుకునేలా నిబంధనలు విధించింది.
ముఖ్యంగా కరోనా వైరస్‌లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 రకంతో అతలాకుతలమవుతున్న చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిల్యాండ్ తదితర దేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసింది. వారిలో ఎవరికైనా కోవిడ్-19 పాజిటివ్ అని తేలితే వారిని క్వారంటైన్‌కు పంపిస్తామని స్పష్టం చేసింది. వీటన్నింటికి తోడు ప్రజలు బూస్టర్ డోసు వేసుకోవాలని సూచించింది. తాజాగా ముక్కు ద్వారా వేసే నాసల్ వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదం తెలిపి, కోవిన్ ప్లాట్‌ఫాం మీదకు తీసుకొచ్చింది.
ఆంక్షల నడుమ కొత్త సంవత్సరం వేడుకలు
కరోనా కొత్త వేరియంట్ వైరస్ ముప్పును దృష్టిలో పెట్టుకుని కొన్ని రాష్ట్రాలు కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలు విధించాయి. అర్థరాత్రి ఒంటి గంట వరకే కొత్త సంవత్సరం వేడుకలకు అనుమతి అంటూ కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, గర్భిణులు, చిన్నారులు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. పబ్‌లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, విద్యాసంస్థల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది. మాస్క్ ధరించనివారికి జరిమానా విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ, కోవిడ్-19 ఆంక్షలను మాత్రం అమల్లోకి తీసుకొచ్చింది. కర్నాటక బాటలో మరికొన్ని రాష్ట్రాలు ఆంక్షలపై కసరత్తు మొదలుపెట్టాయి.
అయితే చైనా తరహాలో బీఎఫ్.7 లేదా ఇతర వేరియంట్లతో భారత్‌కు ఆందోళనకల్గించే స్థాయి ముప్పు లేదని, భారతీయ వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని, బూస్టర్ డోసు తీసుకుని, జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జరిపిన సమావేశంలోనూ ఇవే అంశాలపై చర్చ జరిగింది. ప్రజల్లో భయాందోళనలు కల్గించే తప్పుడు వార్తలను తిప్పికొట్టే విషయంలో ఐఎంఏ వైద్య నిపుణులు సహకరించాలని, ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని అందజేయాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు.