న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఏకగ్రీవంగా తీర్మానించింది. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో 4 గంటలు పాటు కులగణనతో పాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న 5 రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన వ్యూహాలు, మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు గురించి చర్చించారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఆయనతోపాటు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, అశోక్ గెహ్లాట్, సిద్ధరామయ్య, భూపేష్ బఘేల్, సుఖ్విందర్ సింగ్ సుఖూ మీడియాతో మాట్లాడారు. బిహార్ తరహాలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. దేశంలో ‘కుల గణన’ ఆలోచనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రతి సభ్యుడు మద్దతు తెలిపారని వెల్లడించారు. దేశంలోని పేద ప్రజల విముక్తి కోసం ఇది చాలా ప్రగతిశీల అడుగు అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
విపక్ష కూటమిలో చాలా పార్టీలు కుల గణన డిమాండుకు మద్దతు తెలుపుతున్నాయని, కొందరు భిన్నాభిప్రాయం వ్యక్తం చేయవచ్చని, అయినా సరే అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ ఉమ్మడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కూటమిలోని అత్యధికులు కుల గణన ఆలోచనకు మద్దతు ఇస్తారని తాను భావిస్తున్నట్టు రాహుల్ గాంధీ చెప్పారు. కుల గణన అమలు చేయాల్సిందిగా బీజేపీపై ఒత్తిడి తెస్తున్నామని, వారు అమలు చేయకపోతే అధికారం నుంచి తప్పుకుంటారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఎందుకంటే దేశం యావత్తు కుల గణనను కోరుతోందని అన్నారు. కుల గణన అనేది కులమతాలకు సంబంధించిన అంశం కాదని, పేదరికానికి సంబంధించిన అంశమని రాహుల్ గాంధీ సూత్రీకరించారు. దేశంలో ఓబీసీలు, దళితులు, గిరిజనులతో పేద ప్రజల కోసం కులాలవారిగా లెక్కలు సేకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. దక్షిణ భారతదేశంలో కుల గణనకు సంబంధించి ప్రధాన మంత్రి ప్రకటనపై రాహుల్ స్పందిస్తూ ప్రధాని పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణాది ప్రాతినిధ్యానికి కుల గణనకు సంబంధం ఏమిటో అర్థం కావడం లేదన్నారు.
తమకు నలుగురు ముఖ్యమంత్రులు ఉన్నారని, వారిలో ముగ్గురు ఓబీసీ వర్గానికి చెందినవారని రాహుల్ గాంధీ తెలిపారు. బీజేపీకి 10 మంది ముఖ్యమంత్రులు ఉండగా, ఒకరు మాత్రమే ఓబీసీ వర్గానికి చెందిన వారు ఉన్నారని తెలిపారు. భారతదేశ జనాభాలో సుమారు 50 శాతం ఉన్న ప్రజలకు ప్రభుత్వాన్ని నడిపే హక్కు ఉండకూడదా అని ప్రశ్నించారు. కుల గణన డేటాను విడుదల చేస్తామని ప్రధానమంత్రి నేరుగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఓబీసీ వర్గం కోసం ప్రధాని పని చేయనందున ఆయన ఈ విషయం చెప్పలేకపోతున్నారని విమర్శించారు.
రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని, చత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మరోసారి అధికారం చేపడతామని చెప్పారు. తెలంగాణలో అధికారం చేతులు మారి తమ హస్తగతం అవుతుందని అన్నారు. మొత్తం వాతావరణం తమకు చాలా సానుకూలంగా ఉందని, గెహ్లాట్ సృష్టించిన ఆరోగ్య సంరక్షణ నిర్మాణం బహుశా ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మకమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అని కొనియాడారు.