Tuesday, November 26, 2024

Delhi | సామాజిక భద్రత పథకాలపై దేశవ్యాప్త ప్రచారం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్రం సమావేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అతి తక్కువ ప్రీమియంతో దేశ ప్రజలకు అందజేస్తున్న సామాజిక భద్రత పథకాల్లో ప్రజల్ని భాగస్వాములను చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 3 నెలల పాటు భారీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి డా. వివేక్ జోషి అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో మంగళవారం కీలక సమావేశం జరిగింది. ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు 3 నెలల పాటు నిర్వహించే ప్రచార కార్యక్రమం దేశంలోని అన్ని జిల్లాల్లో జరుగుతుందని సమావేశం అనంతరం కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్ర‌ధాన‌మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న (పిఎంజెజెబివై), ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న (పిఎంఎస్‌బివై) వంటి సూక్ష్మ బీమా పథకాలను గ్రామ పంచాయితీ స్థాయిలో ప్రోత్సహించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.

ఆయా రాష్ట్రాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం పథకాల్లో నమోదు ఉండాలని పేర్కొంది. ఏప్రిల్ 13న (రేపు) ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉన్నతాధికారులతో ఈ అంశంపై కేంద్రం సమావేశాన్ని నిర్వహించి, పథకాల్లో చేరికలను ప్రోత్సహించే దిశగా వారికి సూచనలు జారీ చేయనుంది. ఇప్పటి వరకు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం కింద 8.3 కోట్ల మంది నమోదు చేసుకున్నారని, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద 23.9 కోట్ల మంది నమోదు చేసుకున్నారని కేంద్రం తెలిపింది.

ఈ ప‌థ‌కాల‌ కింద ఇప్పటి వరకు మొత్తం రూ. 15,500 కోట్ల విలువైన క్లెయిమ్‌లను అందజేసినట్టు వెల్లడించింది. సామాజిక భ‌ద్ర‌త క‌వ‌ర్‌లో భాగంగా బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు స‌హా స‌మాజంలోని పౌరులంద‌రికీ జీవిత‌ బీమా, ప్ర‌మాద బీమాను అందించడం ల‌క్ష్యంగా కేంద్రం ఈ పథకాలను ప్రవేశపెట్టింది. ఏ కార‌ణంతో మ‌ర‌ణం సంభవించినా రూ. 2 ల‌క్ష‌ల బీమాను పిఎంజెజెబివై అందిస్తుండ‌గా, ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి లేదా పూర్తి శాశ్వ‌త వైక‌ల్యం పొందిన‌వారికి రూ. 2 లక్షల బీమాను ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అందజేస్తోంది. పాక్షిక లేదా శాశ్వ‌త వైక‌ల్యాన్ని పొందిన వారికి రూ. 1 ల‌క్ష బీమాను అందిస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement