న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా సోమవారం తెలంగాణ భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఐక్యతా దినం వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు గాంచారని, ఆయన పుట్టినరోజు జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత తొలి ఉప ప్రధాని, తొలి హోం మంత్రిగా దేశాన్ని ఐక్యంగా తీర్చిదిద్ది ప్రజల్లో సమైక్య స్ఫూర్తి నింపిన వ్యక్తి ఆయన అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్సీ గౌరవ్ ఉప్పల్ భవన్ అధికారులతో దేశ ఐక్యమత్యంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో భవన్ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.