న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పర్యాటక రంగాభివృద్ధికి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోగా జాతీయ టూరిజం పాలసీని ప్రవేశ పెట్టనున్నట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖా మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సదరన్ ట్రావెల్స్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా బుధవారం రాత్రి న్యూఢిల్లీలోని లలిత్ హోటల్లో జరిగిన స్వరోత్సవాల్లో ఆయన మఖ్య అతిథిగా పాల్గొన్నారు. కిషన్ రెడ్డి, సదరన్ ట్రావెల్స్ చైర్మన్ ఆలపాటి వెంకటేశ్వరరావు, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ మోహన్, ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ తదితరులు కొత్త లోగోను ఆవిష్కరించారు.
దేశంలో పర్యాటకాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని కిషన్ రెడ్డి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్డు, విమానయాన సేవలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీ వచ్చే టూరిస్టులకు ముందుగా గుర్తొచ్చేది సదరన్ ట్రావెల్స్ అని కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సుప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయ ఆవరణలో వసతి కల్పన సదుపాయం ఏర్పాటు సదరన్ ట్రావెల్స్ కు గర్వకారణమని తెలిపారు. అనంతరం ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ… ఉక్రెయిన్ యుద్ధ సమయంలో విద్యార్థుల తరలింపులో సదరన్ ట్రావెల్స్ బస్సులు, హోటల్స్ సేవలతో సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. సదరన్ ట్రావెల్స్ ఆంధ్రప్రదేశ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని హర్షం వ్యక్తం చేశారు. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపారు.
అనంతరం ఆలపాటి కృష్ణ మోహన్ మాట్లాడుతూ… భారతదేశంలోని అగ్రశ్రేణి టూర్స్ & ట్రావెల్స్ సంస్థలలో ఒకటైన సదరన్ ట్రావెల్స్ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ ద్వారా కాశీ వస్తున్న ప్రయాణికుల సౌకర్యార్ధం కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలో 18 రూంలు, 36 డార్మిటరీ బెడ్లు ప్రత్యేకంగా కేటాయించినట్టు ఆయన ప్రకటించారు. 5 దశాబ్దాలుగా ట్రావెల్, టూరిజం రంగాలలో విశిష్ట సేవలనందిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం 8 సార్లు బెస్ట్ డొమెస్టిక్ ఆపరేటర్ అవార్డును సొంతం చేసుకుందని తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా తక్కువ ధరలతో ఎక్కువ నాణ్యత ప్రమాణాలను వినియోగదారులకు అందజేస్తున్నామని, దేశవ్యాప్తంగా 11 బ్రాంచీల్లో సేవలు అందజేస్తున్నామని కృష్ణ మోహన్ వివరించారు.
వచ్చే వారం కోల్ కతాలో నూతన బ్రాంచ్ ద్వారా ఈశాన్య రాష్ట్రాలన్నిటిలో సేవలను విస్తరించనున్నామని వెల్లడించారు. మరో సంవత్సరంలో దేశవ్యాప్తంగా 50 సదరన్ బ్రాంచి స్టోర్స్ ప్రారంభించబోతున్నామని ఆయన చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో సౌత్ ఈస్ట్ ఆసియా లో మొదటి విడతలో సదరన్ ట్రావెల్స్ సేవలను విస్తరించబోతున్నామన్నారు. యుఎస్, యూరప్, యూకే, ఆస్ట్రేలియా, కెనెడా లో కార్యాలయలను ప్రారంభిస్తామని… ఢిల్లీ, విజయవాడ, జైపూర్ లో హోటల్ సేవలు అందిస్తున్నామని కృష్ణ మోహన్ వెల్లడించారు.