న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతీయ సంగీతం సముద్రమంత విశాలమైనదని, మన నాటకాలు అజరామరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. సంగీత, నాటకాల ద్వారా భారత సంస్కృతిని కాపాడేందుకు కృషి చేస్తున్న కళాకారుల జీవితాలు ధన్యమని అన్నారు. గురువారం కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జాతీయ సంగీత, నాటక అకాడమీ అవార్డుల కార్యక్రమం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఘనంగా జరిగింది. కరోనా కారణంగా 2019, 2020, 2021 సంవత్సరాల్లో కళాకారులకు పురస్కారాలను అందజేయలేదు. మూడేళ్లకు కలిపి ఒకేసారి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డుల్లో ఆరు తెలుగు రాష్ట్రాల్లో కళా, సంగీత సేవ చేస్తున్న వారికి దక్కాయి.
హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి, కథక్ నృత్యకారులు రాఘవరాజ్ భట్, మంగళ భట్ (సంయుక్తంగా) 2019 సంవత్సరానికి గానూ ఈ అవార్డులు అందుకోగా, 2020 సంవత్సరానికి కర్నాటక సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, ప్రఖ్యాత గాయని ప్రేమ రామ్మూర్తి, కూచిపూడి నృత్య కళాకారులు పసుమర్తి విఠల్, పసుమర్తి భారతి దంపతులు (సంయుక్తంగా) అవార్డులు అందుకున్నారు. 2021 సంవత్సరానికి గానూ నాటక రంగాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తున్న వినాయక నాట్యమండలి (సురభి) నిర్వాహకులు ఆర్. వేణుగోపాల్ రావు సంగీత, నాటక అకాడమీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ భారతదేశం గర్వపడే ఉన్నత స్థాయి కళాకారులను కలవడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఇలాగే సంగీత, నాట్య, నాటక రంగాల్లోని కళాకారులను కలిసేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆమె కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి సూచించారు. భిన్న భాషలు, సంస్కృతులు, భిన్న సంప్రదాయాలకు నిలయమైన భారతదేశంలో ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన సంగీతం, నాటకం, నృత్యం ఉన్నాయని, అవన్నీ వేటికవే ప్రత్యేకమని రాష్ట్రపతి అన్నారు.
అంతకుముందు కిషన్ రెడ్డి మాట్లాడుతూ కళాకారుల్లోని ప్రతిభను గుర్తించి అవార్డులు ఇవ్వడమనేది సంపూర్ణ కళాజగత్తుకే సన్మానంగా భావిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ కళాకారులకు ఇస్తున్న ఈ అవార్డులు కళను తర్వాతి తరానికి అందజేయడంతో పాటు యువ కళాకారులు ఈ రంగాల్లో ముందుకెళ్లేందుకు ప్రోత్సహిస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా.. భారతదేశ కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతోందని, యునెస్కో కూడా భారతదేశ వైభవోపతమైన కళలు, సంస్కృతిని గుర్తించి 40కిపైగా చారిత్రక కట్టడాలు, స్మారకాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చిందని కిషన్ రెడ్డి వివరించారు. దీంతోపాటు దుర్గాపూజ, కుంభమేళా, సంకీర్తనలు, డ్రమ్మింగ్, రాజస్తాన్‌లోని కల్బేలియా జానపద పాటలు, నృత్యాలు, సంప్రదాయ వేద పఠనానికి, సంస్కృత నాటకాలకు, ఛావ్ నృత్యానికి యునెస్కో ప్రత్యేక గుర్తింపునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రస్తావించారు.
సంగీత, నాటక అకాడమీ ద్వారా కళలను ప్రోత్సహించడంతో పాటు వాటిని కాపాడుకునే దిశగా కృషి జరుగుతోందన్న ఆయన, కళాకారులు, రచయితలు, చరిత్రకారులు, విమర్శకులు తదితరుల డేటాను రూపొందించి వారిని ప్రోత్సహించే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. 128 మంది కళాకారులకు అవార్డులు ప్రదానం చేయగా, అందులో 50 మంది మహిళలే ఉండటం ఈ రంగాల్లో స్త్రీ శక్తి చేస్తున్న సేవకు నిదర్శనమని ఆయన కొనియాడారు.