రైతుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం ఎండగట్టారు. ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధర)పై గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్న వారు హరిత విప్లవ పితామహుడు, భారత్ రత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాధన్‌ను అవమానిస్తున్నారని అన్నారు. ఐదేండ్ల పాటు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే నిర్ణయాలు..
కేంద్ర ప్రతిపాదన రైతుల ప్రయోజనాలను కాపాడేలా లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులు బుధవారం తిరిగి ఛలో ఢిల్లీ ప్రదర్శనను పునరుద్ధరించనున్నారు. కేంద్రం, రైతుల మధ్య చర్చల నేపధ్యంలో ఈ ప్రదర్శనను సోమవారం తాత్కాలికంగా నిలిపివేశారు. ఎంఎస్‌పీ హామీ ద్వారా వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతాయని, గ్రామీణ భారతంలో డిమాండ్ పెరుగుతుందని, రైతులు సైతం విభిన్న పంటలను సాగు చేసేలా అన్నదాతల్లో భరోసా కలుగుతుందని రాహుల్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
చిన్నపాటి ఖర్చుకు కేంద్రం వెనుకంజ
రూ. 14 లక్షల కోట్ల బ్యాంకు రుణాల మాఫీ, రూ. 1.8 లక్షల కోట్ల కార్పొరేట్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన దేశంలో రైతుల కోసం చిన్నపాటి ఖర్చుకు కూడా ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. ఇక తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే రైతుల పంటలకు ఎంఎస్‌పీ దక్కేలా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తుందని రాహుల్ ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.