ప్రజాదరణలో ప్రధాని నరేంద్ర మోదీకి తిరుగులేదని మరోసారి రుజువైంది. మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా మోదీకి ఆదరణ ఉందని తాజా సర్వే తేల్చింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతల్లో మోదీకి అగ్రస్థానం కట్టబెట్టింది. మార్నింగ్ కన్సల్ట్ సర్వే విడుదల చేసిన ర్యాంకింగ్స్ జాబితాలో భారత ప్రధాని మోదీ 77 శాతం రేటింగ్‌తో టాప్‌లో నిలిచారు. భారత దౌత్య విధానం, కేంద్ర ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి.
పలు దేశాల పౌరుల అభిప్రాయాల సేకరణ
ఈ ఏడాది తొలి క్వార్టర్ కు సంబంధించి సేకరించిన డేటాతో ఈ లిస్టును వెలువరించినట్లు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ తెలిపింది. ఆయా దేశాలకు చెందిన పౌరుల అభిప్రాయలను క్రోడీకరించి, వారం రోజుల సగటు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక తయారుచేసినట్లు వెల్లడించింది. మోదీ తర్వాతి స్థానంలో 64 శాతం రేటింగ్ తో మెక్సికో ప్రెసిడెంట్ మాన్యుయెల్ లోపేజ్ ఒబ్రాడోర్ నిలిచారు. స్విట్జర్లాండ్ ప్రధాని అలైన్ బెర్సెట్ 57 శాతం రేటింగ్‌తో మూడో ర్యాంకును దక్కించుకోగా.. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ (50 శాతం రేటింగ్) నాలుగవ స్థానంలో, ఐదవ స్థానంలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా డి సిల్వా (47 శాతం) నిలిచారు.
అమెరికా అధ్యక్షుడికి 9వ స్థానం..
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ అల్బనీస్ (45 శాతం) ఆరో స్థానంలో నిలవగా.. ఆయన తర్వాతి స్థానాల్లో వరుసగా.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (44 శాతం) , స్పెయిన్ ప్రధాని పెడ్రో (38 శాతం) ఉన్నారు. కాగా, ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనూహ్యంగా తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఆయనకు కేవలం 37 శాతం ప్రజల ఆమోదం దక్కడం గమనార్హం. ఇక ఈ జాబితాలో భారత సంతతికి చెందిన వ్యక్తి, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 27 శాతం జనాదరణతో 12 వ స్థానం దక్కించుకున్నారు.