Monday, January 6, 2025

National – తమ విధానాల‌తోనే గ్రామాల‌లో వికాసం – ప్ర‌ధాని మోదీ

పేద‌రికాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించామ‌న్న ప్ర‌ధాని
దేశానికి ప‌ట్టుకొమ్మ‌లైన గ్రామీణాన్ని ప‌ట్టించుకోని గ‌త ప్ర‌భుత్వాలు
గ్రామ సీమ‌ల రూపు రేఖలు మార్చిన ఘ‌న‌త బిజెపిదే
అందుబాటులో ప‌ల్లేవాసులకు డిజిట‌ల్ , వైద్య సేవ‌లు
రైత‌న్న‌ల‌కు ప్ర‌తి ఏటా మూడు ల‌క్ష‌ల కోట్ల ఆర్ధిక‌సాయం

న్యూఢిల్లీ – దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని అయితే అటువంటి.గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు ప్ర‌ధాని మోదీ.. త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌లు ప‌థ‌కాల‌తో గ్రామీణ భారతంలో పేదరికం తగ్గిందన్నారు. ఢిల్లీలో నేడు నిర్వహించిన గ్రామీణ భారత మహోత్సవం 2025 కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ, వెనకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. దాంతో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయన్నారు. ఫలితంగా పట్టణాల్లోనూ పేదరికం పెరిగిపోయిందన్నారు. సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నా గ్రామాలకు, పట్టణాలకు మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

అలాగే, దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు తమ పాలనలో సమాన హక్కులు పొందుతున్నాయని వెల్లడించారు. సమాజ సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పాటిస్తున్న విధానాలే గ్రామీణ భారతంలో కొత్త శక్తిని నింపుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇక, మారుమూల గ్రామాల ప్రజలను దేశ అభివృద్ధిలో భాగం చేయడమే లక్ష్యంగా తమ సర్కార్ కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసేందుకు సమ్మిళిత ఆర్థిక విధానాలు అవసరం. ఇక, కరోనా సమయంలో భారత్‌లోని మారుమూల గ్రామల ప్రజలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

ఇక, డిజిటల్ టెక్నాలజీ సహాయంతో దేశంలోని అత్యుత్తమ వైద్యులు, ఆసుపత్రులను మారుమూల గ్రామాలకు అనుసంధానం చేశామని తెలిపారు. గ్రామాలలోని ప్రజలు ప్రస్తుతం టెలీమెడిసిన్ సౌకర్యాలను పొందుతున్నారని చెప్పుకొచ్చారు. అలాగే, పల్లెల్లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగు నీరు, మౌలిక వసతులు అందిస్తున్నామ‌న్నారు.. పీఎం-కిసాన్ పథకం ద్వారా, రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు.. అలాగే, తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల వల్ల గ్రామీణ భారతంలో పేదరికం దాదాపు 26 శాతం నుంచి 5 శాతానికి తగ్గిపోయిందని నరేంద్ర మోడీ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement