నాణ్యమైన ఉత్పత్తులకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ మేరకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ మాదిరి ఉత్పత్తుల్లో దేశంలో గుజరాత్ అగ్రస్థానంలో ఉంది. 9693.91 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు గుజరాత్లోని వివిధ జిల్లాల నుంచి పొరుగు దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలోని విశాఖ జిల్లా ఎగుమతులకు సంబంధించి 14వ స్థానంలో ఉంది. ఆ తర్వాత 18వ స్థానంలో తూర్పు గోదావరి జిల్లా ఉంది. విశాఖ జిల్లా నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 2755.02 మిలియన్ డాలర్ల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.
వీటిలో ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్ రసాయనాలు, ఫార్యస్యూటికల్స్, సముద్ర ఉత్పత్తులు.. పెట్రోలియం ఉత్పత్తులు, కొబ్బరికి సంబంధించిన ఉత్పత్తులు, అల్లం పొడి, బెల్లం పొడి, జీడిపప్పు, నల్ల మిరియాలు, అరకు కాఫీ, పసుపు, తేనె వంటి ఉత్పత్తులు, ఏటికొప్పాక బొమ్మలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా నుంచి 2196.98 మిలియన్ డాలర్ల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎగుమతి అయిన వాటిలో ఇంజనీరింగ్ ఉత్పత్తులు, బియ్యం, విద్యుత్ ఉపకరణాలు, మాంసం, పౌల్ట్రిd ఉత్పత్తులు, కొబ్బరిపీచు, పంచదార, ఉప్పాడ చీరలు ఉన్నాయి. ఎగుమతుల్లో రాష్ట్రానికి కొంతమేర జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నా దక్షిణాది రాష్ట్రాలకో పోలిస్తే వెనుకబడి ఉందనే చెప్పాలి. ఏపిలో ఉన్న విమానాశ్రయాలు, పోర్టుల సమీపంలో శీతల గిడ్డంగుల నిర్మాణాలు వంటి ఏర్పాట్లు జరిగితే ఎగుమతుల్లో రాష్ట్రం మరింత రాణించే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital