రైతుల ఛలో ఢిల్లీ ప్రదర్శన సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ తీరుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ విరుచుకుపడింది. అన్నదాతలను జైల్లో నిర్బంధించడం తప్పని ఆక్షేపించింది. రైతుల ఆందోళన నేపధ్యంలో ఢిల్లీలోని బవానా స్టేడియంను జైలుగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చామని ఆప్ ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 13న రైతుల మార్చ్ నేపధ్యంలో నిరసన కారులను అదుపులోకి తీసుకునేందుకు బవానా స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా మార్చాలని కేంద్రం సోమవారం ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాసింది. రైతుల డిమాండ్లు న్యాయమైనవని, రాజ్యాంగం ప్రకారం శాంతియుత నిరసనలు చేపట్టడం ప్రతి పౌరుడి హక్కని ఆప్ స్పష్టం చేసింది.
రైతులు ఈ దేశానికి ఆహారం సమకూరుస్తారని, అన్నదాతను జైల్లో పెట్టడం తప్పని ఆప్ పేర్కొంది. ఇక పంజాబ్ నుంచి దేశ రాజధానికి రైతులు తరలివస్తుండటంతో వారిని అడ్డకునేందుకు నగరవ్యాప్తంగా వివిధ అంచెల్లో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో బారికేడ్లు, ఇనుప కంచెలు, కంటెయినర్ వాల్స్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య చర్చలు అసంపూర్తిగా ముగియడంతో రైతులు 13న ఛలో ఢిల్లీ పిలుపు ఇచ్చారు.
ఎవరికీ అనుకూలం కాదు: రైతు సంఘం నేత సర్వన్ సింగ్
రైతుల ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు ఉందన్న వార్తలను పంజాబ్ కిసాన్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పాంథర్ తోసిపుచ్చారు. బీజేపీ తరహాలోనే కాంగ్రెస్ కూడా రైతుల దుస్ధితికి బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు. సాగు చట్టాలను తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, రైతులు ఏ పార్టీ పట్ల సానుకూలంగా లేరన్నారు. రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కోసం మంగళవారం దేశ రాజధానికి బయలుదేరుతూ సర్వన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. తాము రైతుల గళం వినిస్తామని, సీపీఐ, సీపీఎం సహా ఏ పార్టీ పక్షం కాదని, రైతుల డిమాండ్లపై పోరుబాట పట్టామని స్పష్టం చేశారు.
ఇది అందరి సమస్య..
ఇది కేవలం అన్నదాతల సమస్య కాదని, జర్నలిస్టులు, ఎన్ఆర్ఐలు, మేథావులు సహా 140 కోట్ల దేశ పౌరులందరిదీ ఈ ఉద్యమమని పేర్కొన్నారు. రైతుల నిరసనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని, చర్చలకు మేము సిద్ధమేనని, ప్రభుత్వం చర్చలకు సిద్ధమైతే ఏ క్షణమైనా చర్చించవచ్చన్నారు. అయితే తమ నిరసనలను జాప్యం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆరోపించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతుండగా.. దీనిపై కమిటీ వేస్తామని కేంద్ర మంత్రి చెబుతున్నారని మండిపడ్డారు. రైతుల ఆందోళనల నేపధ్యంలో హరియాణ, పంజాబ్ రాష్ట్రాల్లోని గ్రామాల్లో ప్రజలను పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు