న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాజకీయంగా, సిద్ధాంతపరంగా ఎన్ని విభేదాలున్నా పార్లమెంట్ సభ్యులకు జాతీయ ప్రయోజనాలే పరమావధి కావాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్భోధించారు. కుల, మత, లింగ, ప్రాంత విభేదాలకు దాటుకుని భారతదేశమే ప్రథమం (నేషన్ ఫస్ట్) భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే పార్లమెంటులో ప్రజోపయోగ చట్టాలపై చక్కటి చర్చలు జరిగేందుకు వీలవుతుందన్నారు. అప్పుడే మన రాజ్యాంగ నిర్మాతలు, నాటి నేతలు కలలుగన్న ప్రజాస్వామ్య భారత నిర్మాణం సాధ్యమవుతుందన్నారు.
సోమవారం పార్లమెంటు భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, రాజ్యసభలో అధికార పక్ష నేత పీయూష్ గోయల్, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సహా కేంద్ర మంత్రులు, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి ఐదేళ్ల పదవీకాలంపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఐదేళ్లపాటు భారతదేశ రెండో అతిపెద్ద రాజ్యాంగ హోదాలో, రాజ్యసభ చైర్మన్ గా పనిచేయడం సంతృప్తినిచ్చిందన్నారు.
రాజ్యసభ చైర్మన్‌గా సభా కార్యక్రమాల నిర్వహణను విజయవంతంగా చేపట్టడంలో అన్ని పార్టీలు సహకరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సభా మర్యాదలు కాపాడటం, సభ్యులకు గౌరవం కల్పించేందుకే చాలాసార్లు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతీయతకు, మన సంస్కృతి, సంప్రదాయాలకే తానెప్పుడూ పెద్దపీట వేశానని, దేశమే ప్రథమం, తర్వాతే వ్యక్తిగత అన్న నినాదాన్ని పాటించానని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని ఉపరాష్ట్రపతి సూచించారు. నిరంతరం ప్రజలతో మమేకం కావడం ద్వారా చాలా విషయాలు తెలుస్తాయని, తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచీ యువత, మహిళలు, శాస్త్రవేత్తలు, వైద్యులు, వివిధ రంగాల నిపుణులతో నిరంతరం మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నానన్నారు. అది విషయాలపై లోతైన అవగాహన పెంచుకునేందుకు ఉపయుక్తమైందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం జరుపుకుంటున్న తరుణంలో మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుకు తెచ్చుకుని వాటి ప్రేరణతో నవభారత నిర్మాణానికి సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాలని ఇందులో ఎంపీలు పోషించాల్సిన పాత్ర కీలకమని ఉపరాష్ట్రపతి ప్రోత్సహించారు. భారతదేశంలో యువశక్తి ప్రతిభాపాటవాలకు కొదువలేదని, వాటికి పదునుపెట్టి సరైన అవకాశాలు కల్పించి సద్వినియోగ పరుచుకుంటే భారతదేశం అంతర్జాతీయ యవనికపై అద్భుతాలు సృష్టించగలదని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ దిశగా ఎంపీలు దృష్టిసారించాలన్నారు. భారతదేశం స్వాతంత్ర్యాన్ని సముపార్జించుకుని 75 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ.. ఇంకా లింగ వివక్ష, పేదరికం, నిరక్షరాస్యత ఉన్నాయని, వీటిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషిచేయాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ అప్పారావు గారి మాటలను ఉపరాష్ట్రపతి ఉటంకించారు. ఈ మాటల స్ఫూర్తి పార్లమెంటు చర్చల్లో కనిపించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసినపుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలరని వెంకయ్య నాయుడు అన్నారు. ప్రతి ఒక్కరూ ఇతరులపట్ల సహనంతో వ్యవహరించడం అవసరమన్నారు. ప్రభుత్వం, విపక్షాలు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుని ముందుకెళ్లాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
పార్లమెంటులో, అసెంబ్లీల్లో సీనియర్ నాయకులు మాట్లాడిన ప్రసంగాలను వినడం, వారి రచనలు చదవడం ద్వారా విషయావగాహన పెరుగుతుందన్న ఆయన, అది యువ ఎంపీలకు ఎంతగానో ఉపయుక్తం అవుతుందని సూచించారు. పార్లమెంటు ఉభయసభల్లో ఇటీవలి కాలంలో కొత్తగా వచ్చిన ఎంపీలు చాలా చక్కగా మాట్లాడుతున్నారని, అలాంటి వారికి తాను ఫోన్ చేసి మరీ అభినందిస్తానని ఆయన అన్నారు. ఈ ఐదేళ్లలో తనకు అన్నిరకాలుగా సహకరించిన ప్రధామంత్రి, కేంద్ర మంత్రులు, విపక్ష పార్టీ నేతలు, ఎంపీలు, డిప్యూటీ చైర్మన్, ప్యానెల్ ఆఫ్ చైర్మన్స్ కు ఉపరాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపారు.
అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. తాను కార్యకర్తగా ఉన్నప్పటినుంచీ వెంకయ్యనాయుడు గారితో ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడితో తనకున్న పలు అనుభవాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.