పట్నా – కేవలం ఇద్దరు, ముగ్గురు సంపన్నుల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. దేశ జనాభాలో 73 శాతం ఉన్న దళితులు, వెనకబడిన తరగతుల వారిని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు…
కేంద్రంలో భాజపాను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోన్న విపక్షాల కూటమి ‘ఇండియా’ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించింది. బిహార్ రాజధాని పట్నాలో జరిగిన భారీ బహిరంగ సభకు విపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ , సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో సహా పలువురు భాగస్వామ్య పక్షాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతోపాటు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు..
భారత్ జోడో న్యాయ్ యాత్రకు విరామం ఇచ్చి పట్నా సభకు హాజరైన రాహుల్ గాంధీ పదిహేను నిమిషాల పాటు ప్రసంగించారు మోదీ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. నీతీశ్ కుమార్ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆర్జేడీ నేత తేజస్వీపై ప్రశంసలు గుప్పించారు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న 17 నెలల కాలంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు సృష్టించారని అన్నారు.
సింహాసనాలే కదిలిపోతాయ్.
.ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రధాన ప్రత్యర్థి నీతీశ్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన ఆయన.. కేంద్రంలో మోదీని అధికారం నుంచి దించేందుకు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
యూపీ, బిహార్‌లలో కలిసి 120 ఎంపీ స్థానాలున్నాయని.. ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా ఓటమి చెందితే ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించిన ఫొటోలు పోస్టు చేసిన ఆయన యువనేతలు ఒకచోట కలిస్తే, గొప్ప సింహాసనాలు కూడా కదిలి పోతాయంటూ వ్యాఖ్యానించారు.
ఈ సమావేశంలో వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డీ రాజా, దీపంకర్ భట్టాచార్య ప్రసంగిస్తూ.. మోదీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.