‘నేషనల్ హెరాల్డ్’ కేసు దర్యాప్తులో భాగంగా, రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే(79)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించారు. యంగ్ ఇండియా, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)లో ఖర్గే కీలక బాధ్యతలు చేపట్టినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఆయనకు నోటీసులు పంపిన ఈడీ, సోమవారమే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లిన ఖర్గేను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారని, విచారణలో పలు అంశాలపై స్పష్టత కోసం ఆయనను పిలిచినట్లు పేర్కొన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్‌గాంధీ తదితరులు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారంటూ భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి గతంలోనే ఫిర్యాదు చేయగా దీనిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్రపన్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు.
ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై దిల్లిలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. గత ఏడాది ఈ కేసుకు సంబంధించి హర్యానాలో రూ 64 కోట్ల విలువైన ఆస్తిని ఈడీ అటాచ్ చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. హర్యానాలోని పంచ్‌కులలో ప్లాట్‌ను ఏజేఎల్‌కు అప్పటి సీఎం భూపీందర్ సింగ్ హుడా చట్టవిరుద్ధంగా కట్టబెట్టారు. 1982లో ప్లాట్‌ను ఏజేఎల్‌కు కేటాయించగా 1992, అక్టోబర్ 30న ప్లాట్‌ను ఈ ప్లాట్‌ను హుడా తిరి వెనక్కితీసుకుంది. కేటాయింపు లేఖలో పేర్కొన్న షరతులను ఏజేఐ నెరవేర్చలేదని హుడా ఆరోపించింది. ఇక 2005లో నిబంధనలకు విరుద్ధంగా అప్పటి హర్యానా సీఎం భూపీందర్ సింగ్ హుడా తన అధికారాన్ని ఉపయోగించి ఏజేఎల్‌కు రీఅలాట్‌మెంట్ పేరుతో రూ 59,39,200కు కట్టబెట్టారని ఈడీ ఆరోపించింది. 2011, ఫిబ్రవరి, 2017 జూన్‌లో ప్లాట్ విలువమార్కెట్‌లో వరుసగా రూ 32.25 కోట్లు, రూ 64.93 కోట్లు కాగా అప్పటి సీఎం హుడాకు నష్టం చేకూరుస్తూ ఏజేఎల్‌కు అనుచిత లబ్ధి చేకూర్చారని ఈడీ ఆరోపించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..