న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యారంగంలో ఉన్న అంతరాలను తొలగించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ నాణ్యమైన ఉన్నత విద్యను అందించినపుడే సమగ్రవిద్యావికాసం సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మానవాళి పురోగతిలో, జాతి నిర్మాణంలో, ప్రపంచ సమృద్ధిలో విద్య పోషించే పాత్ర అత్యంత కీలకమన్న ఆయన, సృజనాత్మకమైన ఆలోచనల దిశగా యువతరాన్ని ముందుకు నడిపేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు కలిసి రావాలన్నారు. ఆదివారం ఢిల్లీ విశ్వవిద్యాలయం శతజయంతి ఉత్సవాలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, విద్యను భారతీయీకరణ చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వైభవోపేతమైన సంస్కృతి, సంప్రదాయాలు, విలువల సమ్మిళితమైన భారతీయ విద్యావిధానాన్ని గురించి తెలుసుకుని ఇక్కడ విద్యనభ్యసించేందుకు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు భారతదేశానికి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
నాటి కాలంలో నలంద, తక్షశిల, విక్రమశిల, పుష్పగిరి వంటి విశ్వవిద్యాలయాల్లో దేశ, విదేశీ విద్యార్థులు విద్యనభ్యసించి.. ఈ జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసేవారన్నారు. మళ్లీ అదే వైభవాన్ని మన విద్యావిధానానికి తీసుకువచ్చేందుకు మన విద్యావిధానాన్ని భారతీయీకరణ చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. విద్యను కేవలం పట్టాలు పొందడం, ఉద్యోగ సముపార్జనకే కాకుండా, జ్ఞానసముపార్జనకు, సమాజాన్ని జాగృతం చేసేందుకు, ఉద్యోగ కల్పనకు మూలంగా భావించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ఇందుకోసం మాతృభాషలో విద్యావిధానం జరగాల్సిన అవసరాన్నీ ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. కనీసం పదోతరగతి వరకైనా మాతృభాషలో విద్యను అభ్యసించడం ద్వారా విషయ పరిజ్ఞానం పెరిగేందుకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఇందుకోసం నూతన జాతీయ విద్యావిధానం ద్వారా మార్పులు తీసుకొచ్చేలా కేంద్రం చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి అభినందించారు. స్థానిక పరిపాలనలో, న్యాయవ్యవస్థలోనూ మాతృభాష వినియోగాన్ని పెంచడం ద్వారా స్థానికులకు ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టు తీర్పులపై అవగాహన పెరుగుతుందన్నారు. భారతీయ సంస్కృతి, విలువలను, నైతికత, వివిధ కళలను కూడా బోధించడం ద్వారా బాల్యం నుంచే విద్యార్థుల సమగ్రవికాసానికి బాటలు పడతాయని ఆయన పేర్కొన్నారు.
శాంతియుత వాతావరణంతోనే అభివృద్ధి సాధ్యమన్న ఉపరాష్ట్రపతి, శాంతి నెలకొనేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. సమాజ పురోగతిలో అందర భాగస్వాములు అవడంతోపాటు, అందరినీ కలుపుకుని పోయేలా, సర్వమానవ సౌభ్రాతత్వంతో ముందుకెళ్లాలని సూచించారు. ‘సర్వేభవంతు సుఖిన:, వసుధైవ కుటుంబకం’ అన్న భారతీయ జీవన విధానాన్ని ప్రస్తావించారు. విద్యార్థులకు మార్గనిర్దేశనం చేస్తూ మాతృభాషతోపాటుగా ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం తదితర అంశాలను ప్రాధాన్యతగా తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. యోగా ద్వారా శారీరక దారుఢ్యంతోపాటు, మానసిక సంతులనం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రపంచం ప్రకృతి విపత్తులతోపాటుగా ఎన్నో సమస్యలను చవిచూస్తోందని.. వీటికి పరిష్కారాలకోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల్లో ఢిల్లీ విశ్వవిద్యాలయం కూడా భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. వివిధ రంగాల్లో విస్తృతమైన పరిశోధలనకు ప్రాధాన్యతనిస్తూ నూతన ఆలోచనలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరాన్నీ ఆయన గుర్తుచేశారు.
దేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం శతజయంత్యుత్సవాలు జరుపుకోవడం అద్భుతమైన సంయోగమన్న ఉపరాష్ట్రపతి.. దేశం స్వాతంత్ర్య శతాబ్ది జరుపుకునే నాటికి దేశం సాధించే పురోగతిలో తమదైన ముద్ర ఉండేలా ఢిల్లీ విశ్వవిద్యాలయం వచ్చే 25 ఏళ్ల కోసం ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. దీంతోపాటుగా 10 ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో చోటు దక్కించుకునేందుకు అవసరమైన కృషి జరగాలని కూడా ఆయన సూచించారు. విద్యారంగంలో ఉన్నతమైన ప్రమాణాలతో ముందుకెళ్తున్న ఢిల్లీ విశ్వవిద్యాలయం భవిష్యత్తులోనూ మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ యోగేశ్ సింగ్, దక్షిణ ఢిల్లీ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సాయి ప్రకాశ్, డీన్ ఆఫ్ కాలేజెస్ ప్రొఫెసర్ బలరామ్ పాణి, ఢిల్లీ ప్రాంత చీఫ్ పోస్ట్ మాస్టర్ మంజుకుమార్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ వికాస్ గుప్తతోపాటు విశ్వవిద్యాలయ బోధన సిబ్బంది, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.