న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మే 16న జాతీయ సదస్సు నిర్వహిస్తామని ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ (ఎఐఎడబ్ల్యుయు) ప్రకటించింది. ఢిల్లీలో బుధవారం వ్యవసాయ కార్మికుల సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది. ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ (ఎఐఎడబ్ల్యుయు) నేతలు బి. వెంకట్, సునీత్ చోప్రా, విక్రమ్ సింగ్, వి శివదాసన్, భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బికెఎంయు) నేత జిఎస్ గోరియా, ఆల్ ఇండియా అగ్రికల్చరల్ అండ్ రూరల్ లేబర్ అసోసియేషన్ (ఎఐఎఆర్ఎల్ఎ) నేత ధీరేందర్ ఝా, ఆల్ ఇండియా సంయుక్త కిసాన్ సభ (ఎఐఎస్ కెఎస్) నేత కర్నైల్ సింగ్ ఇకోలాహా, అఖిల భారత అగ్రగామి కృషి శ్రామిక్ యూనియన్ (ఎఐఎకెఎస్ యు) నేత ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వ్యవసాయ కార్మికుల పరిస్థితి, వారు ఎదుర్కొంటున్న సవాళ్లపై కూలంకషంగా చర్చించారు.
అనంతరం ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కోర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎఐఎడబ్ల్యుయు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. విజయ రాఘవన్, బి.వెంకట్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సమస్యలపై జాతీయ సదస్సును నిర్వహించాలని వ్యవసాయ కార్మిక సంఘాలు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. మే 16న హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో జాతీయ సదస్సు జరగనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సును ప్రముఖ జర్నలిస్ట్, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (పిఎఆర్ఐ) వ్యవస్థాపకులు పి. సాయినాథ్ ప్రారంభిస్తారని తెలిపారు.
వ్యవసాయంలో యాంత్రీకరణ, లేబర్ టెక్నాలజీని విచక్షణారహితంగా ఉపయోగించడంతో వ్యవసాయంలో పని దినాలు తగ్గాయని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోవడానికి సరిపడా పనిని పొందడం లేదని, ఫలితంగా గ్రామాల్లో ప్రత్యామ్నాయ పని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళవలసి వస్తుందని పేర్కొన్నారు. గత 25 ఏళ్లలో శ్రామిక వర్గాల జీవితాలను, జీవనోపాధిని ప్రతికూలంగా ప్రభావితం చేసిన నయా ఉదారవాద ఆర్థిక విధానాలను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసిందని అన్నారు.
దీర్ఘకాలిక నిరుద్యోగం, ధరల పెరుగుదల కారణంగా, గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం ద్వారా పరిస్థితిని తగ్గించడానికి ఉపాధి హామీ ఉపయోగపడుతుందన్నారు. ఉపాధి హామీని పట్టణ ప్రాంతాలకు విస్తరించడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. అయితే బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మత విద్వేషాలను వ్యాప్తి చేయడం, దేశంలోని వనరులను దోచుకోవడంలో కార్పొరేట్‌లకు సహాయం చేయడంలో బిజీగా ఉందని ధ్వజమెత్తారు. ఈ సమస్యలన్నింటినీ జాతీయ సదస్సులో చర్చించి భవిష్యత్ పోరాటాలను నిర్ణయిస్తామని పేర్కొన్నారు.