Saturday, November 23, 2024

National – హ‌స్తినలో క‌మ‌లద‌ళం భేటీ – తొలి జాబితాపై హైకమాండ్​ కుస్తీ

న్యూఢిల్లీ – రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సందర్బంగా పలు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు వందకుపైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఈ సందర్భంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పోటీ చేయనున్న లోక్‌సభ అభ్యర్థులను బీజేపీ సీఈసీ ఖరారు చేయనుంది. దాదాపు వందకుపైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీంతో, ఆశాహహుల్లో కొంత టెన్షన్‌ నెలకొంది.

ఆశ‌ల ప‌ల్ల‌కిలో తెలంగాణ నేత‌లు ..

ఇక.. తెలంగాణలో ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై స్థానిక నేతలతో పలుమార్లు సమావేశమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి కూడా మెజార్టీ అభ్యర్థులను బీజేపీ హైకమాండ్‌ ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 17 స్థానాలకు గాను 12స్థానాల్లో అభ్యర్థుల జాబితా కొలిక్కివచ్చిందని బీజేపీ నేతల టాక్. నలుగురు సిట్టింగ్‌లు, ఈటల, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరెడ్డి వంటి వారి పేర్లున్నాయని స‌మాచారం.. ఇక మిగిలిన స్థానాల్లో ఆశావహులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. హస్తిన వెళ్లి ఎవరి లాబీయింగ్ వాళ్లు చేస్తున్నారు.

ఓడిన ఎమ్మెల్యేల‌కూ చాన్స్

ఓ వైపు విజయ సంకల్పయాత్రంలో పాల్గొంటూ మరోవైపు అభ్యర్థుల కసరత్తుపై కన్నేసి ఉంచారు. గెలుపు గుర్రాలనే బరిలో దించాలని భావిస్తున్న కాషాయదళం.. టికెట్ల కేటాయింపునకు ఏ ప్రామాణికత ఆధారంగా ఇస్తుందోనని ఆశావాహులు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు తమ అభ్యర్థిత్వాలపై పలువురు నేతలు ధీమాగా ఉన్నారు, మల్కాజిగిరి నుంచి తనకే అవకాశం వస్తుందని ఈటల రాజేందర్, చేవేళ్ల నుంచి కొండా, మెదక్ నుంచి రఘునందన్, ఆదిలాబాద్ నుంచి మరోసారి తనకే చాన్స్ ఇస్తారని సోయం బాపురావు ఆశతో ఉన్నారు. మిగిలిన స్థానాల్లో పార్టీ కోసం కష్టపడిన నేతలకు అలాగే బీఆర్ఎస్ నుంచి వచ్చే సిట్టింగ్ ఎంపీలకు చాన్స్ ఇవ్వనున్నట్లు స‌మాచారం. అందులో ముఖ్యంగా పి. రాములు పేరు గ‌ట్టిగానే వినిపిస్తుందని పార్టీ లీడర్ల నుంచి సమాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement