దక్షిణాది రాష్ట్రాల్లో లేని పట్టు
కేరళ, కర్నాటక, తమిళనాడులో కష్టమే
కర్నాటకలో పాత సీట్లు వస్తే గొప్పే
ఏపీ, తెలంగాణలోనూ అదే సీన్
ఉత్తరాదినా తగ్గనున్న స్థానాలు
బీహార్‌లో ఆర్జేడీ నుంచి గట్టిపోటీ
అసలు వాస్తవాలు ఇవే అంటున్న అనలిస్టులు
అయినా.. గట్టి ధీమాతో ఉన్న మోదీ
ప్రస్తుతం బీజేపీ నినాదం వై నాట్ 370. రామమందిర జోష్‌లో ఉన్న కమలనాధులు ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో సాధించిన 304 సీట్ల కంటే అధిక స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. ప్రధాని మోదీ తాము తప్పకుండా 370 సీట్లలో విజయబావుటా ఎగురవేస్తామని గంటాపథంగా చెబుతున్నారు. ఇక.. వైనాట్ 370 కోసం అనుసరించాల్సిన వ్యూహంపై శనివారం నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలోని ప్రగతి మైధాన్లో బీజేపీ జాతీయ సమావేశాలకు శ్రీకారం చుట్టుంది. ఈ సమావేశాల్లో మోదీ, అమిత్ షా, నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ ప్రజా ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు, రాష్ట్రాల అధ్యక్షులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొంటున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో కష్టమే..
దక్షిణ భారత దేశంలో ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 129 ఎంపీ సీట్లున్నాయి. ఇందులో తమిళనాడు 39, కేరళలో 20 సీట్లలో ఒక్కటి కూడా బీజేపీ గెలుచుకునే అవకాశాలు లేవన్న వాదనలున్నాయి. ఇక్కడ బీజేపీ ఒక్క సీటు గెలిచినా అద్భుతమే అని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక.. కర్నాటకలో 2019లో గెలిచిన అత్యధిక సీట్లను ఈసారి బీజేపీ నిలబెట్టుకుంటుందా అనేది కూడా అనుమానమే. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో అది పెద్ద ఎఫెక్ట్‌గా ఉంటుందనే ప్రచారం ఉంది. అలా కర్నాటకలో బీజేపీ 20 దాకా సీట్లు తెచ్చుకుని, తెలంగాణలో గతసారి నాలుగు సీట్లు గెలుచుకున్నట్టే.. ఈసారి కూడా వాటిని నిలబెట్టుకుంటే పర్వాలేదనే అంచనాలున్నాయి.
ఏపీ, తెలంగాణలో బోటాబోటి..
ఏపీలో టీడీపీతో పొత్తులతో ఒకటి రెండు స్థానాలు వచ్చినా ఓవరాల్ గా చూస్తే 129 నుంచి బీజేపీకి దక్కేవి పాతికకు మించి ఉండవనే చర్చ జరుగుతోంది. అలాగే.. మహారాష్ట్రలో శివసేనతో కలసి గతసారి బీజేపీ బాగానే పెర్ఫార్మ్ చేసింది. ఈసారి సీట్లు తగ్గవచ్చనే వాదనలున్నాయి. పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీకి గతసారి వచ్చిన 18 సీట్ల కంటే పెరిగినా ఒకటి రెండు అదనం అవుతాయే తప్ప పెను ప్రభంజనం అయితే ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బీహార్ నుంచి గట్టిపోటీ..
ఇక.. బీహార్ లో గతసారి బీజేపీ స్వీప్ చేసి పారేసింది. ఈసారి అలా కాదు.. లాలూ నాయకత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ కమ్యూనిస్టుల కూటమి నుంచి గట్టి పోటీ ఉండే అవకాశాలున్నాయి. అయినా.. మెజారిటీ సీట్లు గెలుచుకుంటే ఓకే అని చెప్పాలి. ఇలా చూసుకుంటే పంజాబ్, హమాచల్ ప్రదేశ్ వంటి చోట్ల సీట్లు బాగా తగ్గుతాయి. ఓవరాల్‌గా చూస్తే బీజేపీకి రామ మందిరం ద్వారా కానీ ఇండియా కూటమి పటిష్టం కాకపోవడం వల్ల కానీ మరోసారి విజయం సాధించేందుకు చాన్స్ ఉండవచ్చు.. కానీ 370 ఎంపీ సీట్లు సొంతంగా ఎలా వస్తాయన్నది మాత్రం విశ్లేషకులకే అర్ధం కాని పరిస్థితి ఉంది.
ఈసారి ఇంకాస్త తగ్గే చాన్సెస్..
అయితే.. బీజేపీకి 2019లో వచ్చిన 304 ఎంపీ సీట్ల కంటే కొంచెం తగ్గినా సొంత మెజారిటీతో మూడోసారి అధికారంలోకి వస్తే అది అతి పెద్ద విజయంగానే చూడాలని అనలిస్టులు చెబుతున్నారు. బీజేపీ మాత్రం వై నాట్ 370 సీట్స్ అంటోంది.. ఇక తన మిత్రపక్షాలతో కలిపి ఏకంగా 400 స్థానాల్లో పాగా వేయడం పక్కా అని మోదీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.