Saturday, November 23, 2024

సూర్య బ‌ర్త్ డే – గిప్ట్ గా జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డ్- చిరంజీవి విషెష్

నేడు త‌మిళ స్టార్ హీరో సూర్య పుట్టిన‌రోజు. ఈ బ‌ర్త్ డే సూర్య‌కి ఎంతో స్పెష‌ల్. ఎందుకంటే జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డును ద‌క్కించుకున్నాడు సూర్య‌. శుక్రవారం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 68వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లో భాగంగా జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డుకు సూర్య‌ను ఎంపిక చేశారు. డెక్కన్ ఎయిర్‌వేస్ వ్య‌వ‌స్థాప‌కుడు కెప్టెన్ గోపినాథ్ బ‌యోగ్ర‌ఫీ ఆధారంగా తెర‌కెక్కిన త‌మిళ చిత్రం సూరారై పోట్రు (తెలుగులో ఆకాశం నీ హ‌ద్దురా)లో టైటిల్ రోల్ పోషించిన సూర్య‌కు ఈ అవార్డు ద‌క్కింది.
శ‌నివారం సూర్య జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెబుతూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఈ బ‌ర్త్ డే మీకు నిజంగానే ప్ర‌త్యేక‌మైన‌దేన‌ని చిరు గుర్తు చేశారు.

పుట్టిన రోజు నాడే జాతీయ అవార్డుకు ఎంపిక కావ‌డం అరుద‌ని, అలాంటి అరుదైన అవ‌కాశం మీకు ద‌క్కిందంటూ సూర్య‌కు చిరు స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. ఇలాంటి మ‌రెన్నో పుట్టిన రోజులు జ‌రుపుకోవాల‌ని, మ‌రిన్ని అవార్డులు మీ కోసం ఎదురు చూస్తున్నాయంటూ సూర్య‌కు చిరు బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా బ్యాక్ డ్రాప్‌గా త‌న ఫొటో ఉన్న పెయింటింగ్ ముందు సూర్య నిలుచున్న‌ట్లుగా ఓ ఫొటోను చిరు పోస్ట్ చేశారు. సూర్య‌కు జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డు అందించిన సూరారై పోట్రు సినిమా జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డులో స‌త్తా చాటింది. జాతీయ ఉత్త‌మ చిత్రంగా ఈ చిత్రానికి అవార్డు రాగా… ఉత్త‌మ న‌టి అవార్డు కూడా సూర్య‌కు జోడిగా న‌టించిన అప‌ర్ణ బాల‌ముర‌ళికి ద‌క్కింది. ఇక ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హించిన తెలుగు మహిళ సుధ కొంగ‌ర‌కు ఉత్త‌మ స్క్రీన్‌ప్లే అవార్డు ద‌క్కింది. అన్నింటినీ మించి ఈ సినిమాకు త‌న భార్య జ్యోతిక‌తో క‌లిసి సూర్య‌నే ఈ సినిమాను నిర్మించడం గ‌మ‌నార్హం. వెర‌సి ఉత్త‌మ న‌టుడితో పాటు ఉత్త‌మ చిత్రం అవార్డును కూడా సూర్య‌నే అందుకోనున్నారు. దాంతో ఈ పుట్టిన‌రోజు సూర్య‌కి లైఫ్ లో గుర్తుండి పోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement