Tuesday, November 19, 2024

బిల్లు కోసం పోరాటానికి సిద్ధమన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్‌లో బీసీ బిల్లు, జనగణనలో కులగణన సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. బుధవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ విలేకరులతో మాట్లాడారు. బీసీ ప్రధానిగా ఉన్నప్పుడే పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. రాత్రికి రాత్రే ఈడబ్ల్యూఎస్ బిల్లు సాధ్యమైనప్పుడు బీసీ బిల్లు ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. మా సహనాన్ని, ఓపికను కేంద్ర ప్రభుత్వం పరీక్షిస్తోందన్నారు. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఎన్నికలప్పుడే తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం పరిపాటిగా మారిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

బీసీ బిల్లు, కులగణన పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదని సురేష్ స్పష్టం చేశారు. గత మూడు వారాల నుంచి ఢిల్లీలో అన్ని ప్రధాన పార్టీల ప్రముఖులను, దేశంలోని అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ ప్లోర్ లీడర్లను కలిసి బీసీ బిల్లు సాధన కోసం జీరో అవర్‌లో చర్చించాలని కోరగా సానుకూల స్పందన వ్యక్తమైందని చెప్పుకొచ్చారు. జేఎన్‌యూ విద్యార్థి నాయకులతో వ్యూహాత్మక చర్చలు, సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ బిల్లు కోసం రానున్న రోజుల్లో పోరాటాలను తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement