కరోనా బారినపడి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల్లో చేరే రోగుల్లో కనిపించే ‘సైటోకైన్ స్ట్రామ్’ ముప్పును ‘బారిసిటినిబ్’ ఔషధం సమర్థంగా ఎదుర్కొంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడీ ట్యాబ్లెట్లను అత్యంత చౌకగా అంటే ఒక్కో దానిని కేవలం రూ.30కే అందించేందుకు నాట్కో ఫార్మా ముందుకొచ్చింది. మొత్తం డోసును రూ. 420కే అందిస్తామని పేర్కొంది. మామూలుగా అయితే ఈ ట్యాబ్లెట్ ధర రూ. 3,300 వరకు ఉంటుంది. రోజుకు రెండు చొప్పున మొత్తం 14 ట్యాబ్లెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో బాధితుడు రూ. 46 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఈ ట్యాబ్లెట్లపై మన దేశంలో ఎలి లిల్లీ అనే బహుళజాతి ఫార్మా కంపెనీకి పేటెంట్ ఉంది.
కాగా, ఈ ట్యాబ్లెట్లను తయారు చేసేందుకు ‘వాలంటరీ లైసెన్స్’ ఇవ్వాలని గతేడాది డిసెంబరులో ఎలి లిల్లీని నాట్కో ఫార్మా కోరింది. అయితే, ఆ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ‘కంపల్సరీ లైసెన్సింగ్’ కోసం ముంబైలోని కంట్రోలర్ ఆఫ్ పేటెంట్స్‌కు దరఖాస్తు చేసింది. బారిసిటినిబ్ ఔషధానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) నుంచి నాట్కో ఇప్పటికే అత్యవసర వినియోగ అనుమతి (ఈయూఏ) సంపాదించింది. నాట్కోకు కంపల్సరీ లైసెన్స్ లభిస్తే కనుక కరోనా రోగులకు బోల్డంత ఊరట లభించినట్టే.