హ్యూమన్ ఎక్స్ ప్లోరేషన్ రోవర్ చాలెంజ్
సత్తా చాటిన ఇండియన్ స్టూడెంట్స్
ఢిల్లీ, ముంబై స్కూల్, కాలేజీ విద్యార్థుల ఘనత
రెండు విభాగాల్లో నాసా అవార్డుల అందజేత
సొంతంగా తయారు చేసిన రోవర్లు
చంద్రుడు, అంగారక గ్రహనేలను పోలిన
ప్రదేశంలో చాకచక్యంగా నడపడమే ఈ పోటీ ఉద్దేశం
అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ నిర్వహించిన హ్యూమన్ ఎక్స్ ప్లోరేషన్ రోవర్ చాలెంజ్‌లో రెండు భారత విద్యార్థి బృందాలు సత్తా చాటాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతానికి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థ స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అవార్డు సాధించారు. అలాగే ముంబయికి చెందిన ద కనాకియా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు రూకీ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 600 మందికిపైగా విద్యార్థులతో కూడిన 72 టీమ్స్ ఈ వార్షిక పోటీలో పాల్గొన్నాయి. అలబామా రాష్ట్రంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఏప్రిల్ 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి.
పోటీలో పాల్గొన్న 13 దేశాల విద్యార్థులు
అమెరికాలోని 24 రాష్ట్రాలతోపాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, ప్యూర్టోరికో, భారత్ సహా మరో 13 దేశాల నుంచి 42 కాలేజీలు, యూనివర్సిటీలు, 30 హైస్కూళ్ల విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని వారి టాలెంట్ ప్రదర్శించారు. తాము తయారు చేసిన రోవర్లను చంద్రుడు, అంగారక గ్రహంపై ఎగుడుదిగుళ్లతో ఉండే నేలను పోలిన అర కిలోమీర్ ప్రదేశంలో స్వయంగా నడిపి పరీక్షించారు. మిషన్ పూర్తి చేసేందుకు ఉద్దేశించిన సవాళ్లను అధిగమించేలా పనిచేశారు. రోవర్ల భద్రతా ప్రమాణాలు, డిజైన్లను నాసా ఇంజనీర్లతో కలసి సమీక్షించారు. ఈ పోటీలో అమెరికాలోని డాలస్‌కు చెందిన పారిష్ ఎపిస్కోపల్ స్కూల్ హైస్కూల్ విభాగంలో తొలి బహుమతి సాధించింది. అలాగే కాలేజీ, యూనివర్సిటీ విభాగంలో హంట్స్ విల్లేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అలబామా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది.
భావి శాస్త్రవేత్తలను గుర్తించేందుకే..
విద్యార్థులు భావి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లుగా ఎదిగేందుకు ఈ రోవర్ల డిజైన్ చాలెంజ్ దోహదపడుతుంది. కొత్త ఆలోచనలతో రోవర్ల డిజైన్ ప్రక్రియలో వారు నిమగ్నమయ్యేలా ప్రోత్సహిస్తుంది అని నాసాకు చెందిన వెమిత్రా అలెగ్జాండర్ చెప్పారు. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాలకు ప్రణాళికలు రచించడంలో బాధ్యత తీసుకోబోయే నేటి విద్యార్థులకు ఈ పోటీ ఎంతో విలువైన అనుభవాన్ని అందిస్తుందన్నారు.