Tuesday, November 26, 2024

జగన్ లూటీలపై సీబీఐ చేసింది చాలా తక్కువ: రఘురామ

వైసీపీపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. నేరచరిత్ర కలిగిన ఇద్దరు తనపై రాష్ట్రపతికి లేఖ రాయడంపై ఆయన ఎద్దేవా చేశారు. తాను బ్యాంకు రుణాలు ఎగవేశానని, చర్యలు తీసుకోవాలని.. జగన్, విజయసాయిరెడ్డిలు ప్రధాని మోదీ, రాష్ట్రపతికి లేఖరాయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు. సుమారు 17 కేసుల్లో ఏ1గా ఉన్న వైఎస్ జగన్, ఏ2 విజయసాయిరెడ్డిలకు సుదీర్ఘ నేరచరిత్ర ఉందని, వీళ్లిద్దరిపై రూ.43 వేల కోట్లు దోచారన్న అభియోగాలతో చార్జిషీట్లు ఉన్నాయని, ఇలాంటి దొంగలు నాపై ఫిర్యాదు చేయడమేంటని రఘురామ మండిపడ్డారు. 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తులు తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా బెయిల్‌పై బయట ఉంటూ చిన్న చిన్న కారణాలు చూపుతూ జగన్ ఏడాదిన్నరగా కోర్టు విచారణకు హాజరు కావడం లేదని రఘురామ ఆరోపించారు.

తన గురించి అంతా తెలిస్తే తనకు గత ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ ఎందుకు ఇచ్చారని రఘురామ ప్రశ్నించారు. జగన్ అక్రమాలకు సంబంధించిన కేసుల్లో అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసింది చాలా తక్కువ. జగన్ లూటీలకు సంబంధించిన మొత్తం వివరాలను నేను కోర్టుకు అందించాను. అవే వివరాలను ప్రధాని మోదీ, రాష్ట్రపతికి కూడా వివరిస్తానని రఘురామ అన్నారు. పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నదని ఏపీ లేదా ప్రజా సమస్యలపై కాదని, కేవలం తనపై అనర్హత వేటు వేయించడానికే ప్రయత్నిస్తున్నారని రఘురామ ఆరోపించారు.

ఈ వార్త కూడా చదవండి: టీఆర్ఎస్ ఎంపీ బండా ప్రకాష్‌పై చీటింగ్ కేసు

Advertisement

తాజా వార్తలు

Advertisement