ఆర్ ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై రాజమౌళి బృందానికి ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. నాటు నాటుకు ఆస్కార్‌తో భారత్ గర్వపడుతోందని చెప్పారు. కీరవాణి, చంద్రబోస్‌ను అభినందించారు. ఈ పాట ప్రపంచమంతా పేరు తెచ్చుకుందన్నారు. నాటు నాటు పాటను ఏండ్ల తరబడి స్మరించుకుంటారని చెప్పారు.
గవర్నర్ తమిళి సై శుభాకాంక్షలు..
ఆర్‌ఆర్‌ఆర్ బృందానికి గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కార్‌తో భారతీయులు, తెలుగు సినిమా గర్వించేలా చేశారని అన్నారు. ఈ మేరకు గవర్నర్ ట్విట్ చేశారు..
మరెన్నో అవార్డులకు ఆర్ ఆర్ ఆర్ టీమ్ స్ఫూర్తి – పవన్ కల్యాణ్
భారతీయులు గర్విస్తున్న క్షణాలివని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు ఈ అవార్డు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
విశ్వవ్యాప్తమైన తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి: మంత్రి తలసాని
ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ లభించడం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తంచేశారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నటులు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, రచయిత చంద్రబోస్ ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు సంస్కృతి విశ్వవ్యాప్తం – సోము వీర్రాజు
తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ అవార్డును అందించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర యూనిట్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఎపి బిజెపి శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు. . ‘‘తెలుగు వెండి తెరకు పండుగ రోజుగా నా ఛాతి ఉప్పొంగుతోంది’’ అని అన్నారు. ‘నాటు నాటు’ పాట.. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అందుకోవడం , తెలుగు సంస్కృతి విశ్వవ్యాప్తం అయిందని పేర్కొన్నారు.
మరిచిపోలేని మధుర జ్ఞాపకం …బండి సంజయ్
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడం మర్చిపోలేని మధుర జ్ఞాపకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. విశ్వవేదికపై తొలిసారి భారతీయ సినిమా పాట కు ఆస్కార్ అవార్డు రావడం, అందులోనూ తెలుగు పాట ఆ ఘనత సాధించడం భారతీయులందరికీ ప్రత్యేకించి ప్రపంచంలోని తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు.