న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) జాతీయ పార్టీ గుర్తింపును ఉపసంహరించుకుంటూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు. జాతీయ హోదాను రద్దు చేసే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతికాంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుందని, పార్టీ చరిత్రను చూసి నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. భారత కమ్యూనిస్టు పార్టీ 1925లో స్థాపితమైందని, కేరళ, బెంగాల్, తెలంగాణ సాయుధ పోరాటాల్లో భాగం పంచుకుందని నారాయణ అన్నారు. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసిన పార్టీ అని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దేశం సమైక్యంగా కోరుకున్న పార్టీ తమదేనని, ఇంత చరిత్ర కల్గిన పార్టీకి జాతీయ హోదా రద్దు చేయడం అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ హోదా రద్దు చేసినంతమాత్రాన తాము బలహీనపడిపోమని, ఎలక్షన్ కమిషన్ దృష్టిలో సీపీఐకి గుర్తింపు లేకపోయినా, జనంలో గుర్తింపు ఉందని వ్యాఖ్యానించారు. 26 రాష్ట్రాల్లో తమకు కార్యకర్తలున్నారని, 6 లక్షల సభ్యత్వం కూడా ఉందని అన్నారు.
అలాగే 2 కోట్ల ప్రజా సంఘాల సభ్యత్వం కూడా ఉందని వెల్లడించారు. ఈసీ నిర్ణయంతో ప్రభుత్వ దివాళాకోరుతనం బయటపడిందని నారాయణ అన్నారు. ఎలక్షన్ కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. సీనియారిటీలో 4వ స్థానంలో ఉన్న వ్యక్తిని, గుజరాత్‌కు చెందిన అధికారిని కమిషనర్లుగా నియమించారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ ను నడిపించే పద్ధతుల్లో ఎన్నికల కమిషనర్లను, దర్యాప్తు సంస్థలను నడిపిస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపులో భాగంగానే బీజేపీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని దుయ్యబట్టారు. తమను ఎవరు అడ్డుకోలేరని, తమ పార్టీ ప్రజల్లోకి వెళ్లి ఉధృతంగా ప్రచారం చేస్తుందని చెప్పారు. కమ్యూనిస్టు భావజాలం అంటేనే బీజేపీకి ఇష్టం ఉండదని, అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు.
ఓట్లు, సీట్లు అనేవి పరిగణలోకి తీసుకోకూడదని, ఒకప్పుడు బీజేపీకి కూడా రెండు సీట్లు మాత్రమే ఉండేవని గుర్తుచేశారు. రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు తమ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. కేవలం సాంకేతిక అంశాలతోనే హోదా రద్దు నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం కన్నా రాజకీయ పోరాటం సాగిస్తామని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బీజేపీకి కావాలని, అందుకే దానికి జాతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చారని నారాయణ అన్నారు.
అదానీకి దోచిపెట్టేందుకే స్టీల్ ప్లాంట్ అమ్మకం
విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని అదానీకి దోచిపెట్టడం కోసమే కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం తీసుకుందని నారాయణ ఆరోపించారు. ఇప్పటికే గంగవరం పోర్టును కైవసం చేసుకున్న అదానీ, దిగుమతుల డంపింగ్ కోసం స్టీల్ ప్లాంట్ భూమిని ఉపయోగించుకోవాలని చూస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంటును తీసుకుని స్క్రాప్ కింద అమ్మేస్తారు తప్ప నడిపి ఉపాధి కల్పించాలన్న ఆలోచన వారికి లేదని చెప్పారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనాలని తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయించడాన్ని నారాయణ స్వాగతించారు. స్టీల్ ప్లాంట్ కొంటే నష్టమేమీ ఉండదన్నారు. స్టీల్ ప్లాంటుకు 30 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని, మొత్తం రూ. 3 లక్షల కోట్ల విలువైన ఆస్తి అని తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి బానిసగా మారారని నారాయణ ఆరోపించారు. అదానీకి అనుకూలంగా ఉండకపోతే జగన్‌ను జైల్లో పెడతారని భయపడుతున్నారని చెప్పారు. అమిత్ షాకు, అదానీకు అనుకూలంగా లేకపోతే బీజేపీ నుంచి జగన్ ఇబ్బందులు పడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తాను తీసుకుంటానని జగన్ ఒక్క మాట అంటే, మరుసటి రోజే జైల్లో ఉంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.