టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని లేఖలో కోరారు. దేశంలో 14 రాష్ట్రాలు పరీక్షలు రద్దు నిర్ణయం తీసుకున్నాయని, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వంటి బోర్డులు కూడా పరీక్షలు రద్దు చేశాయని లేఖలో లోకేష్ ప్రస్తావించారు. కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా చర్యలు ఉన్నాయని ఆరోపించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో సీబీఎస్ఈ అవలంబిస్తున్న విధానాన్నే ఏపీ సర్కారు కూడా పాటించేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షాను కోరారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆందోళనలను కూడా గమనించి, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని లోకేష్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, వేలాది పరీక్ష కేంద్రాల్లో 6.7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. అటు 5 లక్షల మంది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు తమ పరీక్షలపై అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఈ రెండు తరగతుల విద్యార్థులు ఎంతో మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని, పరీక్షల వంకతో మరింతమందిని కరోనా సెకండ్ వేవ్ కు పణంగా పెట్టడం తగదని లోకేష్ పేర్కొన్నారు. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులను సూపర్ స్ప్రెడర్లుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని లోకేష్ తన లేఖలో విమర్శించారు.