Friday, November 22, 2024

ఏపీలో పరీక్షలు రద్దు చేస్తే బెటర్!

ఏపీలో కరోనా తీవ్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయటం లేదా వాయిదా వేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. జూన్ లో రాష్ట్రంలో 15 లక్షలకు పైగా విద్యార్థులు  10, ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉందన్నారు. వేచి చూసే ధోరణి కంటే విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వటం ఉత్తమం అని పేర్కొన్నారు. ఏపీలో టీకా పంపిణీ రేటు ఘోరంగా ఉన్న సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం తగదని సూచించారు. పరీక్షల వల్ల కోవిడ్ సోకితే కొందరు విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న అనిశ్చితి, ఆందోళన, ఒత్తిడి  నివారించడానికి పరీక్షలు రద్దు చేయటమే ఉత్తమo అని అభిప్రాయపడ్డారు.

రెండో దశ కోవిడ్ ప్రభావం దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ లోనూ కేసుల తీవ్రత రోజు రోజుకూ ఎక్కువవుతుడటంతో పాటు మరణాల రేటు పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేకపోవడం, వెంటిలేటర్ల కొరత అధికంగా ఉందన్నారు. గత  వారం రోజుల్లో రాష్ట్రంలో  రోజుకు సగటున మూడు వేల కొత్త కేసులను నమోదు అయ్యాయని గుర్తు చేశారు. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ప్రజలు  కోవిడ్ బారీన పడకుండా నివారించవచ్చు అని తెలిపారు. అందుకే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పై ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు.  రాష్ట్రంలో టీకా సామర్ధ్యం పెరిగే వరకు కరోనా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం ఇప్పటికే సిబిఎస్‌ఈ  పరీక్షలను రద్దు చేసిందని తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వం కూడా పదో తరగతి,ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రద్దు చేసిందని, ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు వాయిదా వేసిందని నారా లోకేష్ గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement