Friday, November 22, 2024

ఏపీకి లేని హోదా.. పుదుచ్చేరికి ఎలా?

పుదుచ్చేరి ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో అధికార పార్టీ బిజెపి ఇచ్చిన ఓ హామీ ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఎన్నికల్లో బిజెపి గెలిస్తే పుదుచ్చెరికి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ.. ఏపీలో అధికార వైసీపీ, విపక్ష బీజేపీలను ఇరకాటంలో పెట్టింది. ఈ విషయంపై తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేషన్ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్ర‌త్యేక హోదా అంశాన్ని సీఎం జ‌గ‌న్ తాక‌ట్టు పెట్టార‌ని ఆరోపించారు. ఇప్పుడు పుదుచ్చేరికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని బీజేపీ చెబుతుతోంద‌ని, మోదీ మెడ ‌వంచి తెస్తాన‌న్న ప్ర‌త్యేక‌హోదాని ఏమైందని లోకేష్ ప్రశ్నించారు.

‘మోదీ మెడ ‌వంచి తెస్తాన‌న్న ప్ర‌త్యేక‌హోదాని తాక‌ట్టు పెట్టిన ఫేక్ సీఎం గారూ! ఇప్పుడు బీజేపీ పుదుచ్చేరికి స్పెష‌ల్ స్టేట‌స్ ఇస్తామంటోంది. ఏపీకి ముగిసిన అధ్యాయ‌మైన ప్ర‌త్యేక‌హోదా పుదుచ్చేరిలో ఎలా మొద‌ల‌వుతుందో?’ అని ప్ర‌శ్నించారు.

‘రాష్ట్రంలో క‌మ‌లంతో ర‌హ‌స్య ప్ర‌యాణాన్ని క‌ట్టిపెట్టేసి, పుదుచ్చేరిలో బీజేపీ మిత్రుల గెలుపు కోసం వైకాపా నాయకులతో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్. మీ కేసుల గురించి కాకుండా కాస్తా ప్ర‌త్యేక‌హోదా కోసం ఇప్ప‌టికైనా గ‌ట్టిగా అడ‌గండి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కాగా, ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదాపై లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్‌రాయ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయని..పరిష్కారం తమ చేతుల్లో లేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని నిత్యానంద్‌రాయ్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement