వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. గురువారం నిరుద్యోగ యువతతో సమావేశం నిర్వహించిన ఆయన.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కేవలం 15వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. ఏదో ఒక సినిమాలో బ్రహ్మానందం రూపాయి ఇచ్చి పండగ చేస్కో అన్న పరిస్థితే ఇప్పుడు ఏపీలోనూ నెలకొందన్నారు. 2 లక్షల 30వేల ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం 15 వేలు ఉద్యోగాలు ఇచ్చి పండుగ చేస్కోమంటోందని, వాళ్ల నాయకులు సీఎంకు పాలాభిషేకం చేస్తారని ఎద్దేవా చేశారు. ఇచ్చే 36 గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు ఆయనకు పాలాభిషేకం చేయాలా? అని ప్రశ్నించారు.
10వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులకు ప్రభుత్వం ముష్టి వేస్తోందా అని మండిపడ్డారు. గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించి 2018లో చంద్రబాబు ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఈ ప్రభుత్వం ఇప్పటికీ భర్తీ చేయలేకపోయిందని లోకేష్ విమర్శించారు. దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. ఇవాళ ఏపీపీఎస్సీ రాజకీయ వేదికగా మారిందని ఆరోపించారు. అర్హులు బయట ఉన్నారని, డబ్బులు ఖర్చుపెట్టినవారు లోపల ఉన్నారన్నారని లోకేష్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: వైసీపీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం