ఏపీ సీఎం జగన్పై టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్ ఆ హామీని నెరవేర్చడం పక్కనబెట్టి సొంత బ్రాండ్ మద్యం బాటిళ్లను అమ్మిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.
‘దశలవారీ మద్యనిషేధం చేస్తామంటిరి కదా వైఎస్ జగన్ గారు.. దశలవారీగా మద్యం అమ్మకం వేళలు మారుస్తూ.. తెల్లారి పాల ప్యాకెట్లు అమ్మే సమయానికి ముందే మద్యం షాపులు తెరిచి ఏం సందేశం ఇస్తున్నారు?’ అని లోకేష్ విమర్శించారు. ‘కరోనా మందుల్లేక ప్రాణాలు పోతున్నాయంటే, నా సొంత బ్రాండ్ మందు ప్రెసిడెంట్ మెడల్ తాగమంటున్నట్టుంది మీ ఎవ్వారం. బెడ్లు, ఆక్సిజన్, వ్యాక్సినేషన్ గాలికొదిలేసి లిక్కర్ షాపులు 6 గంటలకే తెరిచి ప్రజల్ని దోపిడీ చెయ్యడానికి ప్రభుత్వం పరితపించడం దారుణం’ అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.