వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై తనకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని తిరుపతిలో అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వివేకా హత్యపై ప్రమాణం చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ అంశంలో గతంలో ఏప్రిల్ 14న ప్రమాణం చేస్తానని చెప్పిన నారా లోకేష్… ఈరోజు ఏప్రిల్ 14 కావడంతో మరోసారి జగన్‌పై విమర్శలు గుప్పించారు.
‘వైఎస్ జగన్.. బాబాయిని చంపింది ఎవరో ఈ రోజు తేలిపోతుంది. నేను రెడీ.. నువ్వెక్కడ? తిరుపతి వచ్చి వెంకన్న సాక్షిగా వివేకా గారి హత్యతో నీకు, నీ కుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చెయ్యి. రాకపోతే వివేకా గారిని వేసేసింది అబ్బాయే అనే విషయం ప్రపంచానికి అర్థమవుతుంది’ అని లోకేష్ ట్వీట్ చేశారు. ‘జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే అలిపిరికి రావొచ్చు కదా.. ఎందుకు రాలేదు? నారాసుర రక్త చరిత్ర అంటూ పెద్ద పెద్ద వార్తలు రాశారు. మా కుటుంబానికి రక్తచరిత్ర లేదు. కత్తితో బతికేవాడు కత్తితోనే చస్తాడు.. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో’ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.