జపాన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్, మాజీ వరల్డ్ నంబర్ వన్ నవోమి ఒసాకా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. 2019, 2021లలో ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నవోమి ఒసాకా నిలిచిన విషయం తెలిసిందే. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒసాకా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులను షాక్‌కు గురిచేసింది. ప్రతి ఏడాది నాలుగు గ్రాండ్ స్లామ్స్ జరుగగా… అందులో ఆస్ట్రేలియా ఓపెన్ మొదటిది. సీజన్ ఫస్ట్ గ్రాండ్ స్లామ్‌గా పేరున్న ఈమెగా టోర్నీకి ఒసాకా మాత్రం దూరంగా ఉండనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి 16 నుంచఇ మెల్‌బోర్న్‌లో ప్రారంభం కానుంది. ఇప్పటికే పురుషుల టెన్నిస్ దిగ్గజం, ప్రపంచ నం.1 ఆటగాడు, యూఎస్ ఓపెన్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ ఈ టోర్నీకి దూరమయ్యాడు.
కాలికి గాయం కావడంతో అతను ఈ సీజన్‌లో ఆడడం లేదు. వెటరన్ టెన్నిస్ స్టార్, అమెరికా క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. ఇటీవలే ఆక్లాండ్‌లో ముగిసిన ఈ టోర్నీలో ఆమెకు గాయమైంది. దీంతో ఆమె కూడా ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఒసాకా కూడా ఆడట్లేదు. దాంతో, మ్యాచ్‌లు కళ తప్పుతాయని టెన్నిస్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.