Friday, November 22, 2024

Nanded – ప్ర‌భుత్వ హాస్ప‌ట‌ల్ లో మ‌ర‌ణ మృదంగం – 48 గంట‌ల‌లో 31 మంది మృతి…

మహారాష్ట్ర లోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణ మృదంగం కొనసాగుతోంది . తాజాగా మరో 7 మరణాలు నమోదయ్యాయి. అందులో నలుగురు చిన్నారులే ఉండటం గమనార్హం. తాజా మరణాలతో కలిపి 48 గంటల వ్యవధిలో మొత్తం మరణాల సంఖ్య 31కి చేరింది. ఇందులో 16 మంది చిన్నారులే ఉండటం గమనార్హం. నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోగా. నేడు మ‌రో ఏడుగురు క‌న్నుమూశారు. అందులో 12 మంది నవజాత శిశువులు ఉండటం అందర్నీ కలిచివేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులలేమి, సిబ్బంది కొరతే ఈ మరణాలకు కారణమని బాధిత కుటుంబాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ ఘటనపై సీఎం ఏక్‌నాథ్‌ షిండేను విలేకరులు ప్రశ్నించగా, ఆయన స్పందించిన తీరు వివాదాస్పదమైంది. ఘటనపై తనకు సమాచారం లేదని సీఎం వ్యాఖ్యానించారు. అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుంటానని ఆయన చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఈ మరణాలకు బాధ్యత వహించాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఆరోపించారు. కాగా, కొద్దిరోజుల క్రితం థాణే ఆసుపత్రిలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. అక్కడ 36 గంటల్లో 22 మంది రోగులు మరణించారు. ఈ మ‌ర‌ణాల‌పై చ‌ర్చించేందుకు ముఖ్య‌మంత్రి నేడు కేబినేట్ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement