నాందేడ్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత, వసంత్ చవాన్ అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని నైగావ్ వసంత్ చవాన్ స్వస్థలం. 2002లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 నుంచి 2014 వరకు నైగావ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం నాందేడ్ లోక్ సభ నియోజకవర్గం ఎంపీగా కొనసాగుతున్నారు. 2021 నుంచి 2023 వరకు రెండేళ్లపాటు నాందేడ్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా ఉన్నారు.
ఇక ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రతాప్ పాటిల్ చిఖాలికర్‌ను ఆయన 59,442 ఓట్ల తేడాతో ఓడించారు. వసంత్ చవాన్ అంత్యక్రియలు స్వగ్రామమైన నైగావ్‌లో నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.