ప్రభ న్యూస్ : భువనేశ్వర్-ఒడిశాకు చెందిన ప్రముఖ విద్యావేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత నందా పృష్ఠి ఇక లేరు. జాజ్ పూర్ లోని ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతోపాటు దగ్గు, జ్వరం తదితర అనారోగ్య లక్షణాలతో ఆయన నెలరోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ఆయన పేరు నందా పృష్టి అయినప్పటికీ ఒడిశాలో అందరూ నందా మాస్టారిగానే పిలుచుకుంటారు. ఒడిశాలో విద్యారంగం కొత్త పుంతలు తొక్కడానికి ఆయన విశేష కృషి చేశారు.జైపూర్ జిల్లాలో కొన్ని దశాబ్దాలుగా ఉచితంగా చదువు చెప్పారు. ప్రత్యేకించి స్వగ్రామంలో వందశాతం అక్షరాస్యత కోసం తపనపడి సాధించారు.
7వ తరగతితో విద్యాభ్యాసం నిలిచిపోయినప్పటికీ ఆసక్తితో పట్టు సాధించిన ఆయన స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే విద్యావ్యాప్తి కోసం విశేష కృషి చేశారు. ఆయన కృషిని గుర్తించిన ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ ఈ ఏడాది నవంబర్ 9న పద్మశ్రీ పురస్కారంతో సన్మానించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరై అవార్డును స్వీకరించారు. ఆ తరువాత కొద్దిరోజులకే అస్వస్థతకు గురైనారు. కాగా నందామాస్టర్ ఒడిశాలో పేదలకు ఉచితంగా విద్య చెప్పి రాష్ర్టం నలుచెరగులా స్ఫూర్తి నింపారని, ఆయన మృతి తీరని లోటని ప్రధాని నరేంద్రమోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు. తనతోను, రాష్ర్టపతి కోవింద్ తోను నందా మాస్టారు కలసి ఉన్న ఛాయాచిత్రాన్ని ట్యాగ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital