Tuesday, November 26, 2024

నాంపల్లిలో కలర్​ఫుల్​.. నుమాయిస్​ ప్రారంభంతో సందడే సందడి

నాంపల్లి ఎగ్జిబిషన్‌ ద్వారా గొప్ప అనుభూతి పొందవచ్చని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇవ్వాల (ఆదివారం) హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లిలో జ‌రిగే ఎగ్జిబిష‌న్ (నుమాయిష్‌)ను మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొన‌సాగ‌నుంది. 1938లో వంద స్టాళ్లతో ప్రారంభమైన నుమాయిష్‌.. ప్రస్తుతం 1500కుపైగా స్టాల్స్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నుమాయిస్‌ భారీగా ప్రజాదరణ పొందిందన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ ద్వారా గొప్ప అనుభూతిని పొందవచ్చన్నారు. హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ ద్వారా 19 విద్యా సంస్థలు నడుస్తున్నాయని, సొసైటీ ద్వారా 10వేల మందికి లబ్ధి కలుగుతుందన్నారు.

ప్రారంభంలోనే 60శాతం స్టాల్స్‌ నిండిపోయాయని, అన్ని రకాల సాంస్కృతిక సంప్రదాయాలు ఇక్కడ దర్శనమిస్తాయన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఎంతో మంది వ్యాపారులు ఇక్కడకు వస్తారని, 30వేల మంది విద్యార్థులకు ఈ సొసైటీ ద్వారా విద్యనందిస్తున్నారన్నారు. మహిళల చదువుకు సొసైటీ పెద్దపీట వస్తుందన్నారు. సొసైటీలో చదివిన వారంతా ఎంతో మంది ఉన్నతస్థానాల్లో ఉన్నారని తెలిపారు. పదివేల మంది సొసైటీ ద్వారా ఉపాధి పొందుతున్నారన్నారు. ప్రస్తుతం 45 రోజుల పాటు ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఎగ్జిబిషన్‌కు సహకరించిన సహచర మంత్రులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని హెల్త్‌ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆర్టీసీ సైతం ప్రత్యేకంగా బస్సులు నడుపుతుందని మంత్రి హ‌రీశ్‌ చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. 82 సంవత్సరాల నుంచి నుమాయిష్‌ నడుస్తుందన్నారు. నుమాయిష్‌తో వచ్చిన ఆదాయంతో పాఠశాలలు, విద్యా సంస్థలు నడుపడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ స్థలం విషయంలో చొరవ చూపారన్నారు. తన చిన్నతనం నుంచి ఎగ్జిబిషన్‌ కార్యకలాపాలను చూస్తున్నానని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంతో మందికి సొసైటీ ఉచిత విద్యను అందిస్తుందని తెలిపారు. ఎగ్జిబిషన్‌తో వచ్చిన డబ్బులను ఎడ్యూకేషన్‌ కోసం వెచ్చించడం అభినందనీయమని మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. సొసైటీ పదివేల మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement