టీ20 వరల్డ్‌కప్-2024 కోసం జరుగుతున్న ఆఫ్రికా ఖండం క్వాలిఫాయింగ్ టోర్నీలో నమీబియా వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. దాంతోపాటు ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. రెండు జట్లు కోసం జరుగుతున్న అర్హత మ్యాచుల్లో నమీబియా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది.
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నమీబియా 58 పరుగులతో తన్జానియాను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వీరి బ్యాటర్లలో ఓపెనర్లు మిఛెల్ వాన్ లింగెన్ (30), నికొలాస్ డావిన్ (25) రాణించగా.. తర్వాత కెప్టెన్ గెర్హార్డ్ ఎరస్మస్ (21), జెజె స్మిత్ (40 నాటౌట్; 25 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. అనంతరం లక్ష్యచేదనకు దిగిన తన్జానియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 99 పరుగులే చేయగలిగింది. నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తంజానియాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
సికందర్ రజా హ్యాట్రిక్..
క్వాలిఫాయింగ్ మరో మ్యాచ్‌లో జింబాబ్వే 144 భారీ పరుగుల తేడాతో రువాండను చిత్తుగా ఓడించింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రువాండ ప్రత్యర్థి బౌలర్ సికందర్ రజా (2.4-0-3-3) ధాటికి 71 పరుగులకే కుప్పకూలింది. రిచర్డ్ నగరవా 3, ర్యాన్ బర్ల్ 2 వికెట్లు కూడా సత్తా చాటారు. అయితే ఈ మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా హ్యాట్రిక్‌తో కొత్త చరిత్ర సృష్టించాడు. జింబాబ్వే తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ వికెట్ తీసిన తొలి బౌలర్‌గా కొత్త ఘనత సాధించాడు.
దాంతోపాటు భారత స్టార్ విరాట్ కోహ్లీత సమానంగా ఒక ఏడాదిలో అన్ని ఫార్మాట్లలో కలిపి 6వ సారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. సారథి సికందర్ రజా (58; 36 బంతుల్లో 6 ఫోర్లు,4 సిక్స్‌లు), మరుమణి (50), ర్యాన్ బర్ల్ (44 నాటౌట్) విజృంభించి బ్యాటింగ్ చేశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.