- పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పేరు
- సింగూరు ప్రాజెక్టుకు రాజనర్సింహా పేరు ఖరారు
- మంత్రి మండలి భేటీలో నిర్ణయం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దివంగత కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించింది. సింగూరు ప్రాజెక్టుకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే రాజనర్సింహా పేరు పెట్టాలని మంత్రివర్గ సమావేశం ప్రతిపాదించింది.
జూరాల నుంచి కృష్ణా జలాలను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఆయకట్టుకు సాగునీరందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్న్యాయాలను పరిశీలించేందుకు సాంకేతిక నిపుణుల కమిటీని నియమించాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది.
ఇప్పుడున్న ప్రాజెక్టులకు మరింత నీటిని తీసుకునే సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఈ నివేదిక ప్రకారం పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వీలైనన్ని ఎక్కువ భూములకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ పంపిణీ పథకం ఫేజ్-2, ఫేజ్ 3కు మంత్రిమండలి ఆమోద ముద్రవేసింది. గతంలో 15 టీఎంసీలకు ప్రతిపాదించిన ఈపథకాన్ని భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలను పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.