తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైందనే ప్రచారం ఊపందుకుంది. వినవస్తున్న కథనాల ప్రకారం ఇప్పటికే బీజేపీ అధినేతలతో, పెద్దలతో చర్చించినట్టు తెలుస్తోంది. కరుడుకట్టిన కాంగ్రెస్ వాదిగా పేరొందిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానంతో విభేధించి ఆ పార్టీకి రాజీనామా చేశారు.
సమైక్యాంధ్ర పేరుతో పార్టీని పెట్టి 2014 ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం కనిపించకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఏడాది క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ నాయకత్వం స్వీకరిస్తారనే కథనాలు వినిపించాయి. మళ్ళీ కొంతకాలం స్థబ్దుగా ఉంటున్న కిరణ్ బీజేపీ చేరికపై ఇప్పుడు ప్రచారం మొదలైంది. అయితే ఎప్పటిలాగే తాజా ప్రచారంపై కూడా కిరణ్ స్పందించడం లేదు.