Friday, September 20, 2024

Nalin Prabhat | జమ్ముకశ్మీర్ డీజీపీగా ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన నళిన్ ప్రభాత్‌ను జమ్ముకశ్మీర్ పంపాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 30వ తేదీ ప్రస్తుతం డీజీగా ఉన్న ఆర్ఆర్ స్వైన్ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన రిటైర్‌మెంట్ తర్వాత నళిన్ ప్రభాత్ బాధ్యతలు స్వీకరిస్తారు.

ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. తక్షణమే ఆయనను జమ్ముకశ్మీర్ పంపాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏపీ క్యాడర్‌కు చెందిన 1992 ఐపీఎస్ అధికారి అయిన 55 ఏళ్ల నళిన్ ప్రభాత్.. ఆంధ్రప్రదేశ్‌లోని యాంటీ నక్సల్స్ ఫోర్స్ గ్రేహౌండ్స్‌ను నడిపించారు. అలాగే కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ ఆపరేషన్లను నిర్వహించిన అనుభవం ఆయన సొంతం.

నళిన్ ప్రభాత్‌కు మూడు పోలీస్ గ్యాలెంట్రీ మెడల్స్ ఉన్నాయి. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో నళిన్ ప్రభాత్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. సీఆర్పీఎఫ్‌లో పనిచేస్తున్న సమయంలో ఆయన కశ్మీర్ లో ఇన్‌స్పెక్టర్ జనరల్, అడిషనల్ డైరెక్టర్ జరనల్ ఆఫ్ ఆపరేషన్స్‌గా పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement