హైదరాబాద్, ఆంధ్రప్రభ : నల్లగొండ పట్టణంలో బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టనున్న రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు రైతులతో మహాధర్నాను మంగళవారం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈనెల 21న పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో గ్రామ సభలు, సంక్రాంతి రద్దీ కారణంగా బందోబస్తు ఇవ్వలేమంటూ జిల్లా పోలీసులు ధర్నాకు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
మహాధర్నా నిర్వహించి తీరుతామంటున్న నేతలు
నల్లగొండలో ఎట్టిపరిస్థితుల్లో మహా ధర్నా నిర్వహించి తీరుతామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. శాంతియుతంగా నిర్వహించే దర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. ఇక ముందస్తు ప్రణాళిక ప్రకారం.. కేటీఆర్ రైతు దీక్ష జనవరి 12న జరగాల్సి ఉంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైతు ధర్నాను వాయిదా వేశారు. అనంతరం జిల్లా నేతలో చర్చించిన కేటీఆర్ ఈ నెల 21న రైతు ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ పోలీసులు అనుమతి కోరారు. అయితే పోలీసులు అనుమతులు నిరాకరించారు.