Monday, November 18, 2024

నాగోబా జాతర ప్రారంభం – శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి స‌త్య‌వ‌తి..

ప్రాచీన గిరిజన సంప్రదాయాలకు ప్రతీక నాగోబా జాతర
గిరిజనుల సంప్రదాయాలకు తెలంగాణ ప్రభుత్వంలో పెద్ద పీట
జాతరలో ఈసారి గిరిజన దర్భార్ రద్దు..
జాతరకు వచ్చే గిరిజనుల కోసం ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి స‌త్య‌వ‌తి.

అదిలాబాద్ – ఆదిశేషును ఆరాధ్య దైవంగా కొలుస్తూ అత్యంత భక్తి, శ్రద్ధలతో ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, కేస్లాపూర్ లో జరుపుకునే నాగోబా జాతర ప్రపంచంలోనే అతి పెద్ద రెండో గిరిజన జాతర అని, ఈరోజు నాగోబా మహాపూజతో జాతర ప్రారంభం అవుతున్నందున రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజనులందరికీ నాగోబా జాతర శుభాకాంక్షలు తెలిపారు. నాగోబా జాతర ఆదిమ గిరిజనుల ప్రాచీన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఆచార, సంప్రదాయాలకు గిరిజనులు ఇచ్చే ప్రాముఖ్యతకు ఈ పండగ అద్దం పడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల పండగలు, సంప్రదాయాలకు విలువనిస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో వాటిని గొప్పగా నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగానే నాగోబా జాతరను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి జరుపుతోందన్నారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో జాతరలో నిర్వహించే గిరిజన దర్బార్, క్రీడా పోటీలను రద్దు చేసినట్లు మెస్రం వంశీయులు ప్రకటించారన్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం ఆదిశేషును దర్శించుకునేందుకు, ఆయన ఆశీస్సులు పొందేందుకు ప్రాచీన గిరిజన వంశీయులు అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. అత్యంత విశిష్టత ఉన్న ఈ నాగోబా జాతర నేటి నుంచి వారం రోజుల పాటు కొనసాగనుందని, ఈ వారం రోజుల పాటు అక్కడి గిరిజనులకు వసతుల్లో ఎలాంటి లోటు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని, వారం రోజుల పాటు అధికారులు అక్కడే ఉండి జాతరను పర్యవేక్షిస్తారని తెలిపారు. మన రాష్ట్రంలోని గిరిజనులతో పాటు చత్తీస్ గడ్, మహారాష్ట్ర, జార్ఖండ్ నుంచి కూడా గిరిజనులు ఈ జాతరకు వస్తారని, ఇందుకోసం రవాణా సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఆదివాసీల్లోని ఒక తెగ మెస్రం వంశీయుల ఇలవేల్పుగా నాగోబా ఉన్నారని, ఈ జాతరలో మెస్రం వంశీయులే పూజలు నిర్వహించి జాతర జరుపుతారని, గోండులు, పరదాన్, గిరిజన ఆదీవాసీ తెగలంతా ఈ జాతరలో భక్తి, శ్రద్ధలతో పాల్గొంటారని పేర్కొన్నారు. నేటి మహాపూజకు 15 రోజుల ముందు నుంచే మెస్రం వంశీయులు పరదాన్ లతో కలిసి కాలి నడకన చెప్పులు లేకుండా గోదావరి వద్దకు వెళ్లి అక్కడి నుంచి పవిత్ర జలాలు తీసుకొచ్చి, నాగోబా ఆలయం ముందు మర్రి చెట్టు మీద ఉంచి, మహాపూజతో ఆ పవిత్ర జలంతో అభిషేకం చేస్తారన్నారు. మెస్రం వంశ మహిళలు అక్కడి మట్టితో లింగాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తారని, ఇంతటి విశిష్టమైన జాతర తెలంగాణలో జరుగుతున్నందుకు ఎంతో గర్విస్తున్నామని సత్యవతి రాథోడ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement