Saturday, November 23, 2024

Big story | తెలంగాణకు భారీ పెట్టుబడులు.. 700 కోట్లతో నాఫ్‌కో రాక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అమెరికా టూర్‌ను ముగించుకొని దుబాయ్‌ పర్యటనను మొదలు పెట్టిన మంత్రి కేటీఆర్‌.. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజి బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టబడితో మంత్రి కేటీఆర్‌ తన దుబాయి పర్యటన ప్రారంభించారు. అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్‌కో కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ.700 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో కంపెనీ సీఈవో ఖాలిద్‌ అల్‌ ఖతిబ్‌ ప్రతినిధి బృందం సమావేశమైంది.

అనంతరం తెలంగాణ రాష్ట్రంలో తమ అగ్నిమాపక సామాగ్రిని తయారు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.700 కోట్ల భారీ పెట్టుబడిని పెడుతున్నట్లు తెలిపింది. తెలంగాణతోపాటు దేశం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సామాగ్రి, అగ్నిమాపక సేవల అవసరం భవిష్యత్తులో భారీగా పెరుగుతుందని విశ్వాసం తమకుందని నాఫ్‌కో తెలిపింది. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్‌ భారతదేశ డిమాండ్‌కు సరిపోతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

దీంతో పాటు తెలంగాణలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్‌ సేప్టీ ట్రైనింగ్‌ అకాడమీ ఏర్పాటు చేయాలన్న మంత్రి కేటీఆర్‌ ప్రతిపాదనకు కంపెనీ అంగీకారం తెలిపింది. ఈ ట్రైనింగ్‌ అకాడమీ ద్వారా దాదాపు 100కు పైగా దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ సీఈవో మంత్రి కేటీఆర్‌కు తెలియజేశారు.

- Advertisement -

హైదరాబాద్‌కు డిపి వరల్డ్‌

తెలంగాణ రాష్ట్రంలో 215 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి తన కార్యక్రమాలను విస్తరించనున్నట్లు ప్రముఖ పోర్టు ఆపరేటర్‌ డిపి వరల్డ్‌ తెలిపింది. మంగళవారం డిపి వరల్డ్‌ గ్రూప్‌ కార్యనిర్వాక ఉపాధ్యక్షులు అనిల్‌ మెహతా, డిపి వరల్డ్‌ ప్రాజెక్టు డెవలప్మెంట్‌ డైరెక్టర్‌ సాలుష్‌ శాస్త్రిలు మంత్రి కేటీఆర్‌తో దుబాయిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిపి వరల్డ్‌ తెలంగాణలో తన కార్యకలాపాల విస్తరణ తాలూకు ప్రణాళికలను ప్రకటించింది. పోర్ట్‌ ఆపరేటర్‌గా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న డిపి వరల్డ్‌ హైదరాబాదులో తన ఇన్లాండ్‌ కంటైనర్‌ డిపో ఆపరేషన్‌ కోసం 165 కోట్లను పెట్టుబడి పెడుతోంది.

అనంతరం తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది. మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాలలో చేపట్టిన అనేక వ్యాపార అనుకూల పాలసీలను కార్యక్రమాలను కంపెనీ ప్రతినిధులకు వివరించారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ రంగ ప్రగతికి చేదోడు వాదోడుగా నిలిచే కోల్డ్‌ స్టోరేజ్‌ వేర్‌ హౌసింగ్‌ రంగంలో డిపి వరల్డ్‌ తన పెట్టుబడిని తెలంగాణలో పెట్టనున్నట్లు తెలిపింది. మేడ్చల్‌ ప్రాంతంలో 5000 ప్యాలెట్‌ కెపాసిటీ కలిగిన కోల్డ్‌ స్టోరేజ్‌ వేర్‌ హౌస్‌ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 50 కోట్ల రూపాయల పెట్టుబడిని పెడుతున్నట్లు సంస్థ మంత్రి కేటీఆర్‌కి తెలియజేసింది.

లాజిస్టిక్స్‌ రంగం బలోపేతం

డిపి వరల్డ్‌ వంటి అంతర్జాతీయ లాజిస్టిక్స్‌ దిగ్గజం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. తన కార్యకలాపాలను విస్తరించడం వలన తెలంగాణ లాజిస్టిక్స్‌ రంగం బలోపేతం కావడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. డిపి వరల్డ్‌ తన కార్యకలాపాల విస్తరణ కోసం కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం నుంచి అందిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement