మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు తర్వాత సైన్యం నిర్బంధంలో ఉన్న అంగ్ సాన్ సూకీ నిన్న న్యాయస్థానంలో హాజరయ్యారు. ఫిబ్రవరి 1న ప్రభుత్వాన్ని కూల్చేసిన సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. సూకీ సహా 4 వేల మందిని నిర్బంధించింది. దాదాపు మూడు నెలల తర్వాత సూకీ కనిపించడం ఇదే తొలిసారి.
తన వ్యక్తిగత న్యాయవాదులతో ఆమె తొలిసారి కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. సూకీ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆమె లాయర్లు తెలిపారు. 75 ఏళ్ల సూకీని నిర్బంధించిన సైన్యం అధికార రహస్యాలను వెల్లడించడం, అక్రమంగా వాకీటాకీలను ఉంచుకోవడం వంటి అభియోగాలను నమోదు చేశారు. గత నవంబర్ ఎన్నికల్లో ప్రభుత్వం భారీగా అవకతవకలకు పాల్పడిందని, అందుకే ఆ ప్రభుత్వాధికారులను ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేశ సైన్యం పేర్కొంది. సైనిక చర్యను వ్యతిరేకిస్తూ మయన్మార్‌లో జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటి వరకు 800 మంది మరణించారు.