యంగూన్: మయన్మార్ పౌర నేత ఆంగ్ సాన్ సూకీ కి విముక్తి లభించింది. ఆమెకు సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా సైనిక ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. 2021లో సూకీని సైన్యం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వేర్వేరు కేసుల్లో ఆమెను దోషిగా తేల్చారు. అయితే దేశవ్యాప్తంగా దాదాపు ఏడువేల మంది ఖైదీలకు క్షమాభిక్ష కల్పిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. క్షమాభిక్ష కింద ఆమెపై ఉన్న అయిదు కేసుల్ని రద్దు చేశారు. మరో 14 కేసులు అలాగే ఉన్నట్లు తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది.
రాజధాని నైపితాలో ప్రస్తుతం నోబెల్ గ్రహీత సూకీని హౌజ్ అరెస్టు లో ఉన్నారు. సోమవారం ఆమెను ప్రభుత్వ బిల్డింగ్‌కు మార్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఏడాదిగా ఆమె కఠిన జైలు జీవితాన్ని అనుభవించారు. ఎన్నికల ఫ్రాడ్‌కు చెందిన కేసుల్లో ఆమె కోర్టులో పోరాడుతోంది. తనపై చేసిన అభియోగాలను ఆమె ఖండించారు.
క్షమాభిక్ష కల్పించినా ప్రస్తుతానికి సూకీని గృహనిర్బంధంలోనే ఉంచనున్నట్లు మయన్మార్ రేడియో వెల్లడించింది. 78 ఏళ్ల సూకీ తొలిసారి 1989లో అరెస్టు అయ్యారు. 1991లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. 2010లో ఆమె హౌజ్ అరెస్టు నుంచి విముక్తి అయ్యారు. 2015 ఎన్నికల్లో ఆమె పార్టీ మయన్మార్‌లో నెగ్గింది. కానీ సంస్కరణలను వ్యతిరేకించిన సైన్యం మళ్లీ తిరుగుబాటు చేసింది. దీంతో ఆమె ను సైన్యం అదుపులోకి తీసుకుని వివిద అభియోగాలతో కేసులు నమోదు చేసింది..అప్పటి నుంచి ఆమె జైలులోనే మగ్గుతున్నారు.. ఆమె ను విడుదల చేయాలని అంతర్జాతీయంగా వత్తిడులు రావడంతో అక్కడి సైనిక పాలక పక్షం క్షమాబిక్ష ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు.