Sunday, November 24, 2024

బీసీల గొంతుకనై రాష్ట్ర సమస్యలను పార్లమెంట్‌లో వినిపిస్తా : వద్దిరాజు రవిచంద్ర

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణా, బీసీల గొంతుకనై రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో వినిపించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) వెల్లడించారు. సోమవారం ఉ. 10.05 ని.లకు పార్లమెంట్‌లోని తన కార్యాలయంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు రవిచంద్రతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, మాజీ మంత్రి కడియం శ్రీహరి, రవిచంద్ర కుటుంబసభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం పార్లమెంట్ లైబ్రరీ కమిటీ ఛైర్మన్, ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో పార్లమెంట్ లైబ్రరీని సందర్శించి అక్కడి పుస్తకాలను పరిశీలించారు. అక్కణ్నుంచి తెలంగాణా భవన్‌‌కు చేరుకుని అంబేద్కర్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రులు, ఎంపీలతో పాటు కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, తాత మధు, ఎమ్మెల్యేలు రాములు నాయక్, శంకర్ నాయక్, సీనియర్ నేతలు సండ్ర వెంకట వీరయ్యతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు నేతలు, 400 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

టీఆర్‌ఎస్ వెంటే కాపు సామాజికవర్గం : వద్దిరాజు రవిచంద్ర

విలేకరుల సమావేశంలో వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ… రాజ్యసభ సభ్యుడిగా తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇనుగుర్తి నుంచి ఇంద్రప్రస్థకు తీసుకొచ్చిన కేసీఆర్‌కు రుణపడి ఉంటానన్నారు. పార్టీ కోసం పని చేస్తున్నానని, ఇకపై చేస్తూనే ఉంటానని రవిచంద్ర స్పష్టం చేశారు. తెలంగాణా రాష్ట్రంలో బీసీలు సహా సామాజిక న్యాయం ఎలా ఉందో ఈ స్టేజీ మీద ఉన్న వారిని చూస్తేనే స్పష్టంగా అర్థమవుతుందని హర్షం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ఘన విజయానికి కాపు సామాజికవర్గం నుంచి కేసీఆర్‌కు హామీ ఇస్తున్నానన్నారు. కాపు ఒక మాటిస్తే వెనక్కితగ్గడని, టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం తమ కాపు సామాజికవర్గం పూర్తిగా మద్ధతుగా నిలుస్తుందని భరోసానిచ్చారు. కాపు సామాజిక వర్గం టీఆర్ఎస్ వెంట నిలిచి, మళ్లీ గెలిపించేలా తాను ముందుండి నడిపిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని హామీల సాధన కోసం తన ప్రయాణం మొదలుపెడతానని రవిచంద్ర వెల్లడించారు. కేంద్రం 20 అవార్డులు ప్రకటిస్తే, అందులో 19 తెలంగాణకే వచ్చాయంటే రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, కేసీఆర్ వెంట సైనికుడిలా నిలిచి, టీఆర్ఎస్ ప్రతాపాన్ని ఢిల్లీలో చూపిస్తామని ఎంపీ రవి స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్ పోరాటంలో రవి తోడుగా నిలవాలి : ఎర్రబెల్లి దయాకర్‌రావు

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న తీవ్ర అన్యాయంపై పోరాటంలో రవిచంద్ర టీఆర్ఎస్ ఎంపీలకు తోడుగా నిలిచి పోరాడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. పేదవర్గాల ప్రతినిధి గాయత్రి రవికి రాజ్యసభ టికెట్ ఇచ్చి కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహకరించే వ్యక్తిత్వం గాయత్రి రవి సొంతమని ఎర్రబెల్లి కొనియాడారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గాయత్రి రవిని చాలా మంది అభిమానిస్తారని చెప్పుకొచ్చారు. ఖాజీపేటకు ఇవ్వాల్సిన కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించారని, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని సాధించాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందని అన్నారు. గిరిజన యూనివర్సిటీకి భూమి ఇచ్చినా సరే కేంద్రం ఇంకా అమలు చేయడం లేదని ఆరోపించారు. పల్లె ప్రగతికి ఇవ్వాల్సిన నిధులను కూడా కేంద్రం ఇవ్వకుండా తొక్కిపెడుతోందని విమర్శించారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోతే బండి సంజయ్ ఎవరిపై ధర్నా చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ ధర్నాలు చేస్తారంటే ఎలా అని ప్రశ్నించారు? దళిత బంధును ఆపడానికి, వరి ధాన్యం కొనకుండా చేయడానికి బీజేపీ కంకణం కట్టుకుని కూర్చుందని ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒకలా, తెలంగాణ విషయంలో మరోలా వవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

- Advertisement -

ఉభయసభల్లో పోరాడతాం : నామా నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని నామా నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో పొందుపర్చిన బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సహా అనేక ప్రాజెక్టులు అమలు చేయలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వ అన్యాయాలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇదే రాష్ట్రం నుంచి గెలుపొందిన జాతీయ పార్టీల ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించి ఏరోజూ మాట్లాడలేదని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలో పర్యటిస్తూ మాయమాటలు, మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డల ఓట్లతో పార్లమెంటుకు వచ్చిన వారు సభలో ఏమీ మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి పదవితో సమాన అవకాశం : కడియం శ్రీహరి

వరంగల్, ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున నేతలు తరలివచ్చారంటే రవిచంద్రకు ప్రజల్లో ఉన్న పలుకుబడి ఏంటో తెలుస్తుందంటూ మాజీ మంత్రి కడియం శ్రీహరి సీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. గత 8 ఏళ్లుగా కేంద్రం తెలంగాణకు అదనంగా ఇచ్చిన నిధుల్లేవు, విద్యాసంస్థలు లేవు, పరిశ్రమలు లేవని అన్నారు. కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వమని, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం పెట్టమని ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరామని తెలిపారు. కేసీఆర్ స్వయంగా వచ్చి ప్రధానిని కలిసి అనేక విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్రంపై టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు చేస్తున్న పోరాటంలో రవిచంద్ర కూడా తన వంతు పాత్ర పోషిస్తారని ఆశించారు. రవిచంద్రకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి మించి రాజ్యసభ పదవి లభించిందని, ఇది మంత్రి పదవితో సమానమైన అవకాశమని సంతోషం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement