హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ఢిల్లి లిక్కర్ స్కామ్ మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత సీబీఐకి మరో లేఖ రాశారు. ముందుగా ఖరారైన కార్యక్రమాల వల్ల మంగళవారం సీబీఐ అధికారులను కలిసే అవకాశం లేదని, ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా తమ ఇంటికి రావాలని లేఖలో కోరింది కవిత. కాగా సీబీఐ పంపిన నోటీసులకు స్పందించిన కవిత ఇంతకుముందే ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ కాపీ పంపారు. అయితే ముందుగా ఉన్న, ఖరారైన కార్యక్రమాల వల్ల 6న సీబీఐ అధికారులను కలిసే అవకాశం లేదని, ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో అధికారులు రావాలని కవిత మరో లేఖ రాసింది.
“నేను న్యాయవ్యవస్థను నమ్మే వ్యక్తిని. నేను చెప్పిన తేదీల్లో మీరు ఎప్పుడైనా రావొచ్చు. మీ విచారణకు పూర్తిగా సహకరిస్తా” అని లేఖలో తెలిపింది కవిత. కాగా వెబ్‌సైట్‌లో ఉన్న ఎఫ్‌ఐఆర్, నిందితుల జాబితా, ఫిర్యాదును పరిశీలించానని, అందులో తన పేరు ఎక్కడా లేదని కవిత తెలిపింది.